టీడీపీలో నెల్లూరు టికెట్ చిచ్చు: అలకపాన్పు ఎక్కిన మేయర్

By Nagaraju penumalaFirst Published Feb 9, 2019, 3:09 PM IST
Highlights

ఈ నేపథ్యంలో నెల్లూరు టికెట్ ఆశించిన మేయర్  అబ్దుల్‌ అజీజ్‌ అలకపాన్పు ఎక్కారు. తాను టికెట్ ఆశించానని అయితే తనకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మెుండి చెయ్యి చూపారంటూ సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 
 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాగా వెయ్యాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపుగుర్రాలను ఎంపిక చేస్తున్న తరుణంలో కొంతమంది టీడీపీ ఆశావాహులు అలకపాన్పు ఎక్కుతున్నారు. 

చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థుల ఎంపికకు లైన్ క్లియర్ చేశారు. నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో నెల్లూరు టికెట్ ఆశించిన మేయర్  అబ్దుల్‌ అజీజ్‌ అలకపాన్పు ఎక్కారు. తాను టికెట్ ఆశించానని అయితే తనకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మెుండి చెయ్యి చూపారంటూ సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 

మేయర్ అలకబూనడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. మేయర్ ను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రతో రాయబారం పంపించింది. 

దీంతో రంగంలోకి దిగిన బీద రవిచంద్ర అబ్దుల్ అజీజ్ ను కలిశారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారని ఈనెల 15న రాజధానికి రావాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు. 

నెల్లూరు సీటీ, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సమయంలోనే తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించి ఉంటే గౌరవంగా ఉండేది కదా అంటూ బీద రవిచంద్ర వద్ద వాపోయారట. ఈనెల 15న చంద్రబాబు తో కలిసి తన ఆవేదన చెప్పుకుంటానని మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. 
 

click me!