
తనపై సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలయ్య ఎవరంటూ నిలదీశారు . ఆయన హీరో అయితే టీడీపీకి గొప్పకానీ.. తనకు కాదన్నరు. బాలయ్య వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చురకలంటించారు. బాలకృష్ణ ఎన్నోసార్లు తప్పుడు మాటలు మాట్లాడారని.. ఏదో ఒకటి అనడం, తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటన్నారు. ఓ పనికిమాలిన వెధవకి వత్తాసు పలికి స్థాయి దిగజార్చుకోవద్దని గోపిరెడ్డి హితవు పలికారు. మనుషులకు మూడో కన్ను వుండదని.. బాలకృష్ణ కూడా ఒక మనిషేనని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదని ఆయన చురకలంటించారు.
అంతకుముందు నందమూరి బాలకృష్ణ సంచనల కామెంట్స్ చేశారు. రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దని ఓ వైసీపీ ఎమ్మెల్యేను హెచ్చరించారు. నరసరావుపేటలో తమ పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోనని అన్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని కోరారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అలాగే సినిమా అనేది ఊపిరి అని చెప్పారు. సినిమా, రాజకీయం తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు. నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాట వేస్తావేంటని వాళ్ల పార్టీ కార్యకర్తపైనే అరిచారని అన్నారు. ఆయన పేరు తాను తీయనని.. స్థాయి దిగజార్చుకున్నాడని విమర్శించారు. అంతకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? అని అన్నారు. యథా రాజా తథా ప్రజా అని విమర్శించారు.
‘‘జాగ్రత్త హెచ్చరిస్తున్నాను.. మీ పరిధిలో మీరు ఉండండి.. సినిమాను అన్ని పార్టీల వారు, కులాల వారు చూస్తారు. సినిమా బాగుంటేనే ప్రజలు చూస్తారు. సినిమా బాగాలేకుంటే ఎందుకు చూస్తారు?. ఏమంటారు అభిమానులు.. ఒక చిటికెస్తే చాలు.. జాగ్రత్తగా ఉండు. పెద్ద చదువులు చదివావు.. ప్రజా సేవ చేస్తున్నానని అన్నావు... చేసుకో.. ఒకసారి మూడో కన్ను తెరిస్తే.. జాగ్రత్త.. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శిస్తే నేను రెడీ.. సినిమాల విషయానికి వచ్చి బాలకృష్ణ పాట వేస్తావా అంటూ నీచానికి దిగజారిపోవద్దు’’ అని బాలక్షష్ణ హెచ్చరించారు