
వృద్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచనుంది ఏపీ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. అంతకుముందు ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పెన్షన్ 3 వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఏపీ తరహాలో పెన్షన్ అందిస్తోన్న రాష్ట్రం ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు. 8వ తరగతి నుంచి ట్యాబ్స్ ఇస్తున్నామని.. కార్పోరేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్ధితి వచ్చిందని సీఎం అన్నారు. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అమ్మఒడి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామని.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ , ఉచిత విద్యుత్, ధాన్యం సేకరణ చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని.. ఎన్నికల హామీలను మరిచిపోవడం గత ప్రభుత్వానికి అలవాటని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మరో లక్షా 50 వేల ఎంఎస్ఎంఈలు వచ్చాయని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్యను 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. మత్స్యకారులకు 4 ,200 కోట్లు.. నేతన్నలకు 778 కోట్లు అందించామన్నారు. వీధి వ్యాపారులకు వాహనమిత్ర, జగనన్న తోడు వంటి పథకాలతో అండగా నిలిచామని జగన్ పేర్కొన్నారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం తెలిపారు. కోటి 17 లక్షల మంది దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. దిశా యాప్‌తో పాటు దిశా పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దిశా చట్టం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని ఆయన గుర్తుచేశారు.