
మంగళగిరి: అటవీ సంపదను అక్రమంగా మైనింగ్ చేయడమే కాకుండా ప్రశ్నించిన గిరిజనుల హక్కులను కాలరాస్తూ జగన్ సర్కార్ వేదిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గిరిజనుల పట్ల వైసిపి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చూడండంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు లోకేష్.
''ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను కాలరాస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. తమ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణం. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ట. గిరిజన అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారే గిరిపుత్రుల పాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం'' అని లోకేష్ మండిపడ్డారు.
వీడియో
''గిరిజనుల హక్కులు కాపాడాలి, వారికి రక్షణగా ఉన్న చట్టాలు, జిఓలు పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేటరైట్ పేరుతో సాగిస్తున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ దందాని జగన్ అండ్ కో తక్షణమే నిలిపివేయాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
read more వివేకా హత్య కేసు : సీబీఐ ముందుగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించాలి.. రఘురామ కృష్ణరాజు...
అంతకుముందు రహదారి విస్తరణ పేరుతో తాడేపల్లి సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహాన్ని తొలగించడాన్ని కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులను తాలిబన్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
''ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేసారు జగన్ రెడ్డి. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనం'' అని లోకేష్ విరుచుకుపడ్డారు.
''భద్రత పేరుతో ప్రొక్లయినర్లతో పెకిలించిన భరత మాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలి. చేసిన మూర్ఖపుపనికి వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి యావత్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.