
విశాఖపట్నం: మాజీ మంత్రి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ (YS Jagan) బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి (ys viveka murder) దారుణ హత్యపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత చిన్నాన్నను అతి కిరాతకంగా చంపినా పట్టించుకోవడం లేదంటే ఈ హత్య వెనక జగన్ ఉన్నాడనే అనుమానం కలుగుతోందని లోకేష్ పేర్కొన్నారు. వివేకా హత్య కేసు వెనుక ఎవరున్నారో ఆయన కూతురు సునీతా రెడ్డి (sunitha reddy) చెప్పినా జగన్ పట్టించుకోలేదని అన్నారు. ఎక్కడ ఈ హత్యకు పాల్పడిన నిందితుల గురించి బయటపెడతారోనని చివరకు సీబీఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారని... ఇలాంటి వ్యవహారం ఇప్పుడే చూస్తున్నామని లోకేష్ మండిపడ్డారు.
అధికార వైసిపి పార్టీకి అనుకూల పత్రికలో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసారంటూ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తప్పుడు రాతలు రాసిన సాక్షి (sakshi)నుండి పరువు నష్టం కింద రూ.75కోట్లు ఇప్పించాలంటూ లోకేష్ దావా వేసారు. ఈ కేసు ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... తనపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకే సాక్షతో పాటు మరో రెండు పత్రికలకు కూడా నోటీసులు పంపామన్నారు. సాక్షిపై రూ.75 కోట్లు, మరో పత్రికపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు లోకేష్ తెలిపారు.
తప్పు జరిగిందని స్వయంగా పత్రికలే ఒప్పుకున్నాయని... తనకు లేఖలు కూడా రాశాయని లోకేష్ గుర్తుచేసారు. కాబట్టి వార్తలు రాసేముందు వాస్తవాలు తెలుసుకోవాలి... చివరకు ఎవరిపై వార్త రాస్తున్నారో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. కానీ టీడీపీని దిగజార్చేందుకే తప్పుడు వార్తలు రాస్తున్నారని... దీన్ని ఇంతటితో వదిలిపెట్టం.. ఎంతవరకైనా తీసుకెళ్తామని లోకేష్ హెచ్చరించారు.
''రోడ్లపై గుంతలు పూడ్చలేని వాళ్లు మూడు రాజధానులు నిర్మిస్తారా? కొత్త రాజధాని అని విశాఖలో ఏం పీకారు? విశాఖకు మూడేళ్లుగా ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? జగన్ నమ్ముకుంటే మునిగిపోతామని వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.
''అధికార వైసీపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారు. ఏపీలో అన్ని అస్తులనూ జగన్ తాకట్టు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల విభజన చేస్తున్నారు. జిల్లా పునర్విభజనకు చట్టబద్ధత లేదు. ఇలాంటి ప్రభుత్వం ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధమే'' అని లోకేష్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్యపై విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వివేకా కుతురు సునితా రెడ్డి తో పాటు చాలామంది సిబిఐ ఎదుట వాంగ్మూలం ఇవ్వగా పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళను కూడా సిబిఐ విచారించింది. హత్య జరిగిన రోజు మొదట వివేకా ఇంటికి వచ్చింది అవినాష్ రెడ్డినే అని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.