
ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘జగనన్న తోడు’ మూడో విడత కింద లబ్ధిదారులకు ఖాతాల్లోకి సీఎం జగన్ రుణాలను జమచేశారు. 5,10,462 మంది లబ్దిదారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. రూ. 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కలిపి రూ. 526. 62 కోట్లను జమ చేశారు. ఇక, ఈ పథకం కింద రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందిస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున అందజేస్తారు.
రుణాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షలాది మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారని సీఎం జగన్ చెప్పారు. చిరువ్యాపారులు వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని గుర్తుచేసుకన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి లబ్దిచేకూరిందని చెప్పారు.
జగన్న తోడు పథకాన్ని 2020 నవంబర్ 25 ద్వారా ప్రారంభించారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున రుణాలు అందజేస్తున్నారు. రుణం పొందిన లబ్ధిదారులు ఆ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి లబ్దిదారులకు రుణం ఇవ్వగా.. తాజాగా 5,10,462 మంది లబ్దిదారుల రుణాలను అందజేశారు. మూడో విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే 3.56 లక్షల మందికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసింది.
ఇక, జగనన్న మూడో విడుత నిధులు గత వారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.