పోలీసులే గూండాల్లా దాడి... దళిత యువకుడి మృతి: లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Jul 22, 2020, 11:59 AM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా?అని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా?అని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ ని అధికారపార్టీ నేతల మెప్పు కోసం  పోలీసులే శిరోముండనం చేయించి చిత్ర హింసలు పెట్టిన విషయం మరువకముందే ప్రకాశంలో జిల్లాలో మరో దుర్ఘటన జరిగిందన్నారు. చీరాలలో కిరణ్ కుమార్ అనే  దళిత యువకుడు పోలీసుల దాడిలో చనిపోయాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఇలా దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తుల్లా మారి గూండాల్లా దళితులపై దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు పాల్పడిన పోలీసులు, వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిరోముండనం ఘటనపైన ఫాస్ట్ ట్రాక్  కోర్టు ద్వారా విచారణ జరిపించాలి'' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

read more  శిరోముండనమే కాదు... వరప్రసాద్ పై చెప్పులతో దాడి: వంగలపూడి అనిత

ప్రకాశం జిల్లాలో యువకుడి మృతికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 19వ తేదీని కరణ్ కుమార్ అనే యువకుడు మాస్క్ లేకుండా బైక్ పై వెళుతుండగా చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ ఆపారు. అతడు వచ్చిరాగానే బైక్ పై వుండగానే ఎస్సై లాఠీతో చితకబాదడం ప్రారంభించాడు. దీంతో కరణ్ బైక్ పై నుండి కిందపడిపోగా తలకు తీవ్ర గాయమయ్యింది. 

 దీంతో కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. అయితే అప్పటినుండి చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి తాజాగా విషమించి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

కరోనా నియంత్రణ కోసం పోలీసులు కఠినంగా వ్యవహరించాలి కానీ ఇలా ప్రాణాలు తీసేంత కఠినంగా కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. యువకుడి చావుకి కారణమైన చీరాల ఎస్సై వ్యవహరించిన తీరుపై మృతుడి కుటుంబసభ్యులే కాదు ప్రజలకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై లోకేష్ కూడా స్పందిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

  


 

click me!