కుప్పం నుంచి నారా లోకేష్ పోటీ: బాలకృష్ణ సేఫ్, బాబు సీటు అదీ...

By pratap reddyFirst Published Nov 27, 2018, 9:14 AM IST
Highlights

నారా లోకేష్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తూ వస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 

నారా లోకేష్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తూ వస్తున్నారు. నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్రబాబు సీటు మారాల్సి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి మడకశిర శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు. నియోజకవర్గాల పునర్విభజనలో అది ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన గత ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.

 వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. చంద్రబాబు నాయుడు కల్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. కల్యాణదుర్గంలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాయలసీమలో తగిన సమాధానం చెప్పడానికి ఇదే సరైన మార్గమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

click me!