తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్ననే తిరుపతికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు తిరుమల వెంకటేశ్వస్వార స్వామి దర్శించుకున్నారు. తిరుమల వెంకన్నను దర్శించుకొనేందుకు చంద్రబాబు దంపతులు నిన్ననే తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబుకు అందించారు ఆలయ అర్చకులు.
తిరుమల బాలాజీని దర్శించుకున్న తర్వాత తిరుమలలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.2003 లో అలిపిరిలో తనపై మావోయిస్టులు దాడి చేసిన సమయంలో తిరుమల వెంకటేశ్వరస్వామి తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబునాయుడు చెప్పారు. ఇటీవల తనకు కష్టం వచ్చిన సమయంలో తిరుమల బాలాజీకి మొక్కుకున్నానని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామి తన కష్టాలు తీర్చినందున ఆయనకు మొక్కు తీర్చుకొనేందుకు ఆలయానికి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా చంద్రబాబు తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు ఇవ్వాలని వెంకన్నను కోరుకున్నట్టుగా చంద్రబాబు మీడియాకు చెప్పారు.
undefined
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 31న చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది నవంబర్ 20వ తేదీన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.