
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై, బెయిల్ మీద బయటికి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తరువాత అమరావతికి వస్తారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకునే చంద్రబాబు నాయుడుకి టిడిపి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ఆయన తన నివాసానికి వెళ్తారు.
శుక్రవారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ మీటింగ్లో చర్చించనున్నారు. పార్లమెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. టిడిపి ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. శనివారం నాడు చంద్రబాబు నాయుడు విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు.
Top Stories : తెలంగాణలో కాంగ్రెస్సే, నాగార్జునసాగర్ పై ఏపీ వివాదం, అవుకు రెండో టన్నెల్ ప్రారంభం...
డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ రెండవ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మొదట ఈ అఖిలపక్ష సమావేశాన్ని మూడవ తేదీ ఆదివారం నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆరోజు ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఉన్నాయి. దీంతో మీటింగును ఓ రోజు ముందుకి జరిపారు. ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ల నియామకాల బిల్లు, సీఈసీ బిల్లులతోపాటు.. ఐపిసి, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో నిర్దేశించిన మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది.