
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కొట్నూరు చెరువు ముంపు బాధితులను బాలకృష్ణ పరామర్శించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చౌడేశ్వరి కాలనీ వాసులతో మాట్లాడిన బాలకృష్ణ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ నగర్, ఆర్‌టీసీ కాలనీ వాసులకు భోజనం, మంచినీరు అందేలా చూశారు.
ఇక, ఇటీవల కురిసిన వర్షాలు, కర్ణాటక జై మంగలి నది నుంచి వస్తున్న వరద ఉధృతతో పెన్నా నది ప్రవాహం పెరిగింది. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరద తీవ్రరూపం దాల్చింది. హిందూపురంలోని శ్రీకంఠపురం, కొట్నూరు, చెరువుల వద్ద మరువ ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కొన్ని రహదారులు దెబ్బతినడం, చెరువులు పొంగిపోర్లడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.