టిఆర్ఎస్ ను ఎందుకు కెలకాలి ?

First Published Mar 3, 2017, 10:50 AM IST
Highlights

రాష్ట్ర విభజనకు అనుకూలంగా మూడు సార్లు లేఖలిచ్చిన చంద్రబాబు ఇపుడు తప్పుడు మాటలు మాట్లాడటంపై ఈటెల మండిపడ్డారు.

దారిపోయే కంపను నెత్తికి తగిలించుకోవటం ఎలా అన్న విషయం చంద్రబాబునాయుడుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో. గురువారం వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఆ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ మండిపడుతోంది.  ఎంపి కవిత, బాల్కసుమన్, మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తన వ్యాఖ్యలతో తెలంగాణాలో టిడిపికి ఉన్న కొద్ది సానుభూతి కూడా దక్కకుండా చేసుకుంటున్నారు.

 

అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించేటపుడు రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. విభజన జరిగి రెండున్నరేళ్ళయిపోయింది. మరో రెండేళ్ళలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అసెంబ్లీ భవనం ప్రారంభించిన తర్వాత భవనం గొప్పతనం గురించి, తాను పడిన కష్టం గురించి మాట్లాడి ఊరుకుంటే సరిపోయేది. అలాకాకుండా ‘రాష్ట్ర విభజన గాయాలు ఇంకా మానలేద’న్నారు. ‘తనకు తెలీకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయింద’న్నారు. ‘విభజనను ఆపటానికి తాను ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేద’న్నారు. ఇలా..చాలా మాట్లాడారు. ఆ మాటలు విన్న వారంతా అవాక్కయ్యారు.

 

చంద్రబాబు మాటలకు జవాబుగా తాజాగా టిఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ కవిత డిమాండ్ చేసారు. తెలంగాణా అభివృద్ధిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారంటూ రాజేందర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మూడు సార్లు లేఖలిచ్చిన చంద్రబాబు ఇపుడు తప్పుడు మాటలు మాట్లాడటంపై ఈటెల మండిపడ్డారు. పార్టీని తెలంగాణాలో మూసేసుకోవాలంటూ ఎంపి బాల్కసుమన్ చంద్రబాబుకు అల్టిమేటమ్ జారీ చేయటం గమనార్హం.

click me!