
ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణిచేయటం ప్రభుత్వానికి ప్రతిష్టగామారింది. అందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్ రోడ్డును ప్రభుత్వం అష్టదిగ్బంధం చేస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ ఎత్తున పోలీసులను నగరంలోకి దింపుతోంది. ఎదుకంటే, ఉద్యమం జరగటం చంద్రబాబునాయడుకు ఏమాత్రం ఇష్టంలేదు.
అయితే, తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం రాష్ట్రంలోని యువతలో కూడా స్పూర్తిని రగిలించింది. అందుకు తగ్గట్లుగానే 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా బీచ్ రోడ్డులో క్యాండిల్ లైట్ ఉద్యమం చేపట్టాలని యువత నిర్ణయించింది. అందుకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దాంతో ఊద్యమ స్పూర్తి మరింత ఊపందుకున్నది.
అదే సమయంలో ప్రభుత్వం విశాఖలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. బీచ్ రోడ్డే సదస్సుకు వేదిక. సదస్సులో పాల్గొనేందుకు రానున్న దేశ, విదేశీ అతిధులకు ప్రభుత్వం బీచ్ రోడ్డులోనే బస, వసతి ఏర్పాటు చేసింది. సుమారు 2 వేల మంది అతిధులు విశాఖలో 26వ తేదీ నుండి మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సదస్సు మొదలయ్యే ముందు ప్రభుత్వం ఉద్యమాన్ని జరగనిస్తుందా? అందుకనే పోలీసులు ఉద్యమకారుల విషయంలో కఠినంగా ఉండటానికే నిర్ణయించుకున్నారు.
ఉద్యమం చేయాలనుకుంటున్న ప్రాంతం, భాగస్వామ్య సదస్సు జరుగనున్న ప్రాంతం ఒకటే. దాంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉద్యమకారులను బీచ్ రోడ్డులోకి అనుమతించకూడదని డిజిపి ఆదేశించారు. దాంతో విశాఖ నగర పోలీసు కమీషనర్ ఇతర అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ నుండి ఉడా పార్క్ వరకూ ఉండే సుమారు 10 రోడ్లను పోలీసులు అష్టదిగ్బంధం చేస్తున్నారు. గురువారం ఉదయం నుండి మామూలు జనాలెవరూ రోడ్లమీద ప్రయాణించేందుకు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది.
దానికితోడు క్యాండిల్ ఉద్యమానికి ఉత్తరాంధ్ర లో పెద్దగా స్పందన ఉన్నట్లు కనబడటం లేదు. ఉత్తరాంధ్ర జనాలదంతా మొదటి నుండి మూడే డిమాండ్లు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్, వలసలను ఆపటం, మూడు జిల్లాల్లోని కాలుష్యకారక కంపెనీలను తరలించటం. తాజా ఉద్యమంలో ఉద్యమకారులు కానీ పార్టీలు కానీ పై డిమాండ్లలో వేటనీ ప్రస్తావించటం లేదు. తమ డిమాండ్లు లేనపుడు తామెందుకు ఉద్యమానికి మద్దతు పలకాలనే యోచన పలువురు స్ధానికుల్లో కనబడుతోంది. మరి, ఉద్యమకారులమని చెప్పుకుంటున్న వారు ఉత్తరాంధ్రుల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే.