
తమ్ముళ్ళ అంత:కలహాలతో పార్టీ వీధిన పడుతోంది. పాత, కొత్త తమ్ముళ్ల మధ్య వివాదాలు ముదరటంతో చివరకు అధినేతకు తలనొప్పిగా తయారౌతున్నది. సోమవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని తమ్ముళ్ళు ఒకరిపై మరొకరు బాహాటంగానే కలబడటంతో చంద్రబాబే విస్తుపోతున్నారు. వారి మధ్య సయోధ్య కుదర్చటం ఎలాగో అర్ధం కాక తలపట్టుకుంటున్నారు. పార్టీలోని పాత తమ్ముళ్ళకు, కొత్తగా చేరిన తమ్ముళ్లకు మధ్య ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటాలు ఎక్కువయ్యేకొద్దీ వారిని అదుపు చేయటం పార్టీ అధినేతకు కూడా సాధ్యం కావటం లేదు.
ఏ ముహూర్తంలో టిడిపిలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందో కానీ అప్పటి నుండి చంద్రబాబుకు ఒక రకంగా మనశాంతి కరువైందనే చెప్పాలి. పాత, కొత్త తమ్ముళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవటంతో ప్రతీ రోజు పార్టీలో ఏదో ఒక స్ధాయిలో పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. కలహాలు మాని కలిసి పనిచేసుకోమని చంద్రబాబు ఎన్నిమార్లు చెప్పినా ఎవరు వినటం లేదు. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో తమ్ముళ్ల విభేదాలు చాలా పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి.
ఆకర్ష్ పథకంలో భాగంగా ప్రతిపక్షమైన వైసీపీ నుండి 21 మంది శాసనసభ్యులు అధికార తెలుగుదేశంలో చేరారు. అప్పటి వరకూ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ ల్లో ఒక్కసారిగా అభద్రత మొదలైంది. ఆయా నియోజకవర్గాల నుండి ప్రతిపక్షం నుండి శాసనసభ్యులు వచ్చి చేరటంతో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల ఆధిపత్యానికి గండిపడినట్లైంది. దాంతో టిడిపిలోని పాత తమ్ముళ్ళందరిలో ఐకమత్యం పెరిగి కొత్తగా వచ్చిన తమ్ముళ్లపై ఒకరకంగా అప్రకటిత యుద్ధం మొదలైంది.
తాజాగా కర్నూలు జిల్లాలోని భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా భగ్గుమంటున్నది. నంద్యాలలో సోమవారం జరగిన జనచైతన్య యాత్రంలో భాగంగా రెండు వర్గాలు ఎదురుపడినపుడు భూమా వర్గం, శిల్పా వర్గాలు అందరి సమక్షంలోనే తిట్ల పురాణం అందుకున్నారు. అవినీతికి పాల్పడుతున్నది మీరంటే కాదు మీరని ఒకరి అవినీతి చిట్టాను మరొకరు బయటపెట్టుకున్నారు.
ఇక, అనంతపురంలో అయితే, ఎంపి జెసి దివాకర్ రెడ్డి, ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి ఒక రకంగా సోమవారం బలప్రదర్శనకే దిగారు. ఎప్పటి నుండో ఇద్దరి నేతల మధ్య నలుగుతున్న రోడ్ల వైడెనింగ్ వ్యవహారమే తాజా బలప్రదర్శనకు వేదికగా మారటం గమనార్హం. జెసి వరుస చూస్తుంటే చౌదరిని పార్టీ నుండి బయటకు పంపాలని కంకణం కట్టకున్నట్లే కనబడతోంది. అదే విధంగా జెసికి వచ్చే ఎన్నికల్లో ఎంపి టిక్కెట్ దక్కనీయకుండా చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏ విషయంలో కూడా ఎవరూ వెనక్కు తగ్గకపోవటంతో పాటు సామాజిక వర్గాలు కూడా తోడవ్వటంతొ ఇద్దరి మద్య మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. దానికితోడు ఇరువురి బలప్రదర్శనకు వేదిక అనంతపురం పట్టణమే కావటంతో జిల్లాలోని మిగిలిన నేతలకు చాలా ఇబ్బందులుగా తయారైంది. ఎవరినీ శాంత పరిచేట్లు లేరు. ఎవరికీ వత్తాసు పలికేట్లు లేదని మిగిలిన నేతలు వాపోతున్నారు.