25 ఎంపి సీట్లూ టిడిపివే

First Published Dec 31, 2017, 9:14 AM IST
Highlights
  • ‘ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్ధానాల్లోనూ టిడిపిదే గెలుపు’...తాజాగా చంద్రబాబునాయుడు మాటలివి.

‘ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్ధానాల్లోనూ టిడిపిదే గెలుపు’...తాజాగా చంద్రబాబునాయుడు మాటలివి. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అన్నీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవాల్సిందే అంటూ చెప్పారు. పైగా ‘రాష్ట్రంలో అత్యధికి స్ధానాల్లో మనం బాగున్నాం. ప్రజల్లో మంచి సానుకూలత ఉంది’ అన్నారు. టెలికాన్ఫరన్సు లో చంద్రబాబు చెప్పిన విషయాలపైనే పార్టీ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి.

ఒకసారేమో ప్రభుత్వ పనితీరుపై జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందన్నారు. దాన్ని 100 శాతానికి తీసుకెళ్ళాలని చెప్పారు.  తర్వాత ఇంకోసారి మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై జనాల్లో 58 శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నారంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. తాజాగా అత్యధిక శాతం జనాల్లో మంచి సానుకూలత ఉందని అంటున్నారు. ఇక్కడే నేతల్లో గందరగోళం మొదలైంది. 80 శాతం సంతృప్తి కనిపించినపుడు ఏ కారణాలతో జనాలు సంతృప్తిగా ఉన్నారో తెలీదు. తర్వాత 58 శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నారని చెప్పిన చంద్రబాబు మిగిలిన 42 శాతం జనాలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో చెప్పలేదు. మళ్ళీ ఇపుడు ఏ ప్రాతిపదికన అత్యధిక శాతం జనాల్లో సానుకూలత ఉందో వివరించలేదు.

ఇట్లా తడవకొక లెక్క చెబుతుండటం ఏంటో జనాలకు అంతు బట్టటం లేదు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల పరిస్ధితి ఏమీ బాగాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, ఆ సంఖ్యను మాత్రం చెప్పరట. వారితోనే నేరుగా మాట్లాడుతానని చెప్పారు.

ఇంతకీ చంద్రబాబు చెప్పిన ‘ప్రణాళిక’ ప్రకారం పనిచేయటమంటే ఏమిటో మాత్రం వివరించలేదు. ఆమధ్య నంద్యాల ఉపఎన్నికలో గెలవగానే రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ‘నంద్యాల ఫార్ములా’ అమలు చేయాలంటూ చంద్రబాబు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నంద్యాల ఉపఎన్నికలో పార్టీ గెలిచిన విధానంపై నానా హడావుడి చేసి ఏకంగా పుస్తకమే అచ్చేయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నంద్యాల ఉపఎన్నికలో పార్టీ ఎలా గెలిచిందో అందరికీ తెలిసిందే. రేపటి సాధారణ ఎన్నికలో నంద్యాల ఫార్ములా పనికొస్తుందా అన్న విషయంపై పార్టీ నేతల్లోనే అనుమానాలున్నాయి.  సరే, రేపటి ఎన్నికల్లో ఏమవుతుందో చెప్పలేం గానీ మొత్తం మీద పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు బాగానే అవస్తలు పడుతున్న విషయం అర్ధమైపోతోంది.

click me!