
ప్రతిపక్ష ఎంఎల్ఏల హక్కులను చంద్రబాబునాయుడు హరిస్తున్నారు. సభలోపల అధికార పక్షం ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే వారికి మీడియా పాయింట్ ఒక్కటే దిక్కు. ఇప్పటి వరకూ మీడియా పాయింట్ వద్దే వైసీపీ సభ్యులు తమ గళాన్ని వినిపించేవారు. రేపటి నుండి వారికి ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబునాయుడు లేకుండా చేస్తున్నారు. సభలో చంద్రబాబు మట్లాడుతూ, వైసీపీపై ధ్వజమెత్తారు. వారితీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రతిపక్ష సభ్యులు నడుచుకోవటం లేదట. అందుకనే వారిని నియంత్రించేందుకు మీడియా పాయింట్ వద్ద కూడా మార్షల్స్ ను పెట్టాలని సభాపతి కోడెల శివప్రసాద్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
సభలోపల వైసీపీ సభ్యులు హుందాగా వ్యవహరించలేదనే అనుకుందాం. అప్పుడు సభలో నుండి వారిని సస్పెండ్ చేసి బయటకు పంపంటం టిడిపికి కష్టంకాదు కదా? మరి, మీడియా పాయింట్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు? అంటే అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడా వైసీపీ గొంతు వినబడకూడదని చంద్రబాబు అనుకుంటున్నది క్లియర్. అందుకనే మీడియాపాయింట్ ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు చెప్పారు కాబట్టి స్పీకర్ ఎలాగూ ఆ పనిచేసేస్తారు.
అయినా సభా సంప్రదాయాల గురించి సిఎంకు ఇపుడే గుర్తుకొచ్చిందా? ప్రతిపక్షంలో ఉన్నపుడు మీడియా పాయింట్ ను టిడిపి ఎలా వాడుకున్నదో మరచిపోయినట్లున్నారు. అలాగే, అసెంబ్లీలోనే గంటల తరబడి కూర్చున్నది, అసెంబ్లీ ప్రాంగణంలోనే నిద్రించిన సంగతి కూడా చంద్రబాబు మరచిపోతే ఎలా? అప్పట్లో చంద్రబాబు ప్రవర్తనను ఏమనాలి? అంటే, తాను చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారమన్నమాట.