కర్నూలు సభలో కర్నూలు విషయమే మర్చిపోయిన చంద్రబాబు

First Published Sep 19, 2017, 4:10 PM IST
Highlights

రాయలసీమలో జన్మిస్తున్న పిల్లలలో దాదాపు 40 శాతం మంది ఎదుగుదల సమస్యతో బాదపడుతున్నారు.

అదే కర్నూలు జిల్లాలో నైతే 44 శాతం

బాలల హక్కులే భారత బలం అనే పేరుతో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఈ రోజు ఒక  కార్యక్రమాన్ని నిర్వహించింది. బాలల హక్కుల కోసం నిరంతరం శ్రమించి నోబెల్ అవార్డు పొందిన కైలాష్ సత్యార్థి కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఇక్కడ విశేషం. ఈ సమావేశంలో బాలల సమస్యలు, అందులోనూ రాయలసీమ బాలలు ఎదుర్కొంటున్న ఎదుగుదల సమస్యపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని భావించాం. కాని నిరాశే మిగిలింది. బాలల హక్కులు గురించి నిర్వహించిన సభలో ఐక్యరాజ్యసమితి నేతృత్వం లోని బాలల హక్కుల వేదిక నివేదికను కనీసం పట్టించుకోక పోవడం విచారకరం. సాధారణంగానయితే ఇలాంటి   నివేదికను పెద్దగా పట్టించుకోక పోయినా అర్థం చేసుకోవచ్చు. కాని రాయలసీమ గురించి, అందులోనూ సమావేశం జరిగిన కర్నూలు జిల్లా బాలుర గురించి ఆందోళన కలిగించే అనేక విషయాలను ఆ నివేదిక ప్రచురించిందినపుడు చర్చ జరుగుతందని ఆశించడం సహజం. అభివృధి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే అన్ని రాష్ట్రప్రభుత్వాల డొల్లతనాన్ని నివేదిక బయటపెట్టింది. ఆ నివేదికలో రాయలసీమ బాల్యం పై ఆందోళన కలిగించే విషయాలనే ప్రస్తావించింది. రాయలసీమలో జన్మిస్తున్న పిల్లలలో దాదాపు 40% మంది ఎదుగుదల సమస్యతో బాదపడుతున్నారని చెప్పింది. అదే కర్నూలు జిల్లాలో నైతే 44%  అని అని నివేదిక తెలిపింది. అంటే రాయలసీమ సమాజంలో దాదాపు సగం మంది పిల్లలు ఎదుగుదల లోపంతో తోనే పుడుతున్నారని ఆ నివేదిక సారాంశం. దానికి వారు చెప్పిన కారణం మంచినీరు, పేదరికం, నిరక్షరాస్యత, బాల్యవివాహలు.

అసలు సమస్య నీళ్లు

సమస్యకు నాలుగు కారణాలైనా అంతర్లీనంగా ఉన్నది ఒక్కటే సమస్య అది నీటితో ముడిపడిన సమస్య. రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు కల్పిస్తే వ్యవసాయం వృధి చెంది సమాజం పేదరికం నుంచి బయటపడుతుంది. పేదరికం లేకపోతే నిరక్షరాస్యత దాని కారణంగా వచ్చే బాల్యవివాహలు అసలు ఉండవు. పోనీ రాయలసీమలో నీటికి అవకాశం లేదా అంటే తుంగ భద్ర, కుందూ, క్రిష్ణ లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఏటా కనీసం 11 వందల టీ యం సీలు ప్రవహిస్తున్నా సీమ ప్రజలకు త్రాగునీరు కల్పించకపోవడం దుర్మార్గం. బాలల హక్కుల వేదిక అందించిన నివేదికలోనే ఏపీలోని క్రిష్ణా జిల్లాలో బాలల ఎదుగుదల సమస్య 22% మంది పిల్లలో ఉంది. అంటే రాయలసీమ ప్రాంతంతో పోల్చుకుంటే సగానికి సగం మాత్రమే. దానికి కారణం ప్రభుత్వాలు పోటీపడి క్రిష్ణాడెల్టాకు నీటి సౌకర్యాన్ని కల్పించడం. నీరు మొదట ప్రవహించే రాయలసీమకు త్రాగునీరు లేకపోవడం, అదే నది చివరన సముద్రంలో కలిసే ప్రాంతం అయిన క్రిష్ణా డెల్టాకు 3 పంటలకు నీరు అందడం కేవలం మన ఆంద్రప్రదేశ్ లో మాత్రమే కనిపించే దృశ్యం.

రాయలసీమకు నీటి సౌకర్యం కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అడుగడుగనా కనిపిస్తుంది. కానీ బాలల హక్కులు, భద్రత లాంటి విషయాలపై అందులోనూ అత్యధిక పిల్లల భద్రతకు సవాలుగా నిలిచిన కర్నూలు జిల్లాలో జరిగిన సమావేశంలో నయినా ఐక్యరాజ్యసమితి నివేదిక గురించి పట్టించుకోకపోవడం దారుణం.

click me!