టీడీపీ స్థాపనతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదు: నాదెండ్ల

By narsimha lodeFirst Published Feb 11, 2019, 12:07 PM IST
Highlights

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పెట్టాలనేది తన మెకదడులో పుట్టిన ఆలోచన అని... ఈ విషయంలో ఎన్టీఆర్‌కు ఏం సంబంధం లేదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పెట్టాలనేది తన మెకదడులో పుట్టిన ఆలోచన అని... ఈ విషయంలో ఎన్టీఆర్‌కు ఏం సంబంధం లేదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. పార్టీలో తనకు గౌరవ ప్రదమైన స్థానం కావాలని కోరిన విషయాన్ని  ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు‌ను ఓ తెలుగు న్యూస్ ఛానెల్  ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నాదెండ్ల పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని తాను అన్నీ సిద్దం చేసుకొన్న సమయంలో ఎన్టీఆర్ కూడ వచ్చి  తమతో జాయిన్ అయ్యారని చెప్పారు. సినిమాల్లో అవకాశాలు లేక.. రాజకీయాల్లోకి రావాలని ఆయన నిర్ణయించుకొన్నారని నాదెండ్ల చెప్పారు.

పార్టీ కోసం పది పేర్లను తాము ప్రతిపాదిస్తే మనమంతా తెలుగువాళ్లం కదా బ్రదర్ అంటూ తెలుగుదేశంగా పార్టీకి పేరు పెట్టారని నాదెండ్ల చెప్పారు. ఆ సమయంలోనే తనతో ఉన్నవాళ్లంతా ఎన్టీఆర్  నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు.

అప్పటి నుండే ఎన్టీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలను సాగించేవారని తేటతెల్లమైందన్నారు. పార్టీకి తాను కన్వీనర్‌గా ఉన్నానని ఆయన చెప్పారు. కానీ, పార్టీలో తనకు గౌరవప్రదమైన స్థానం కావాలని ఎన్టీఆర్ కోరారని నాదెండ్ల చెప్పారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ బలమైన నేత. ప్రాంతీయ పార్టీ పెడితే ఆమెను ఎదుర్కొనే బలమైన నేత ఉండాలని  తన వెంట నడిచిన వాళ్లు కూడ కోరుకొన్నారన్నారు. తానొక్కడినే ఇందిరాగాంధీని ఎదుర్కొనే సత్తా ఉండదనే అభిప్రాయం వారిలో ఉందన్నారు. కానీ ఎవరిని తీసుకోవాలో మాత్రం వారంత చెప్పలేదన్నారు.

ఎన్టీఆర్ లేకుండానే ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే  తమకు కనీసం 50 సీట్లు వచ్చేవన్నారు. ప్రభుత్వం మాత్రం ఏర్పాటు కాకపోయేదన్నారు. ఎన్టీఆర్ సంక్షోభం తర్వాత  పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే  అప్పటి పరిస్థితులకు అనుగుణంగా  ప్రజలు తీర్పును ఇచ్చారని ఆయన చెప్పారు.

ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రూపులు కట్టారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌కు అడ్మినిస్ట్రేషన్ తెలియదన్నారు. అయితే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి పదవికి తనను ఆహ్వానించారని నాదెండ్ల గుర్తు చేసుకొన్నారు.

పార్టీ ఆవిర్భావంలో తాను కీలకంగా వ్యవహరించానని... అయితే పార్టీ కారణంగా  ఎన్టీఆర్ ఆయన కుటుంబం ప్రయోజనం పొందిందని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. కథానాయకుడు సినిమాలో తాను భవనం వెంకట్రామ్ రెడ్డి  సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో వెళ్లినప్పుడు తనకు ఎన్టీఆర్ పరిచయమైనట్టుగా సినిమాలో చూపించారన్నారు. అయితే వాస్తవానికి తాను భవనం వెంకట్రామ్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కాలేదన్నారు నాదెండ్ల.

తనను సీఎం పదవి నుండి  తప్పించినందుకు ఇందిరా గాంధీపై పీవీ నరసింహారావుకు మనసులో చాలా కోపం ఉండేదని నాదెండ్ల చెప్పారు. ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీక్షిత్‌ను పంపితే  ఎమ్మెల్యేలంతా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరును చెప్పారని నాదెండ్ల చెప్పారు.

ప్రజల తెలివితక్కువతనం వల్ల మంచోడు ఓటమిపాలౌతాడు, చెడ్డవాడు గెలుస్తాడన్నారు. ఎన్టీఆర్ గ్లామర్‌లో తన మంచితనం కొట్టుకుపోయిందన్నారు. ఏడాదిన్నర ఎన్టీఆర్‌ను తాను వెనుక ఉండి నడిపించినట్టు ఆయన చెప్పారు.

తన అడ్మినిస్ట్రేషన్‌ను చెన్నారెడ్డి పొగిడేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. అంజయ్య మాత్రం తనతో విబేధించేవారన్నారు. అర్ధాంతరంగా తనను మంత్రివర్గం నుండి తప్పించారన్నారు. ఈ విషయమై తాను ఇందిరాగాంధీ వద్దకు వెళ్తే  ప్రభాకర్ రెడ్డిని తప్పించాలని కోరితే నిన్ను తప్పించారా అని ఇందిరాగాంధీ తనను ఎదరు ప్రశ్నించారన్నారు.

సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించలేరన్నారు. మెలకువలు తెలియవని చెప్పారు. ఎంజీఆర్ తన అభిమాని అంటూ నాదెండ్ల చెప్పారు.తనను ఎంతగానో అబిమానిస్తూ ఎంజీఆర్ ఓ లేఖ కూడ రాసినట్టుగా నాదెండ్ల ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

తన కొడుకు మనోహర్ జంటిల్మెన్ అంటూ ఆయన కితాబిచ్చారు. తన మాదిరిగా తొందరపాటుతనం మనోహర్‌లోలేదని చెప్పారు. జనసేనలో మనోహర్  చేరే విషయం తనతో చర్చించలేదన్నారు. 


 

click me!