పట్టాభిపై హత్యాయత్నం వెనక హస్తం వారిదే: యనమల సంచలనం

By Arun Kumar PFirst Published Feb 2, 2021, 3:36 PM IST
Highlights

జగన్ అండతోనే వైసిపి గుండాల హింసాకాండ కొనసాగుతోందని... రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ ను, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై హత్యాయత్నాన్ని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఖండించారు. జగన్ రెడ్డి సిఎం అయ్యాక పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారిందన్నాను. జగన్ అండతోనే వైసిపి గుండాల హింసాకాండ కొనసాగుతోందని... రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

''టిడిపి సహా ఇతర ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలు అనైతికం. అవినీతిని ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం అమానుషం. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాల వెనుక హస్తం వైసిపిదే.. ప్రజల ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. పట్టాభిపై హత్యాయత్నం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు ఎత్తేయాలని'' అని యనమల డిమాండ్ చేశారు.

read more  అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్: జిల్లా జైలుకి తరలింపు

మరోవైపు తనపై దాడి జరిగే అవకాశం ఉందని పట్టాభి వారం రోజుల క్రితమే చెప్పారని ఆయన భార్య అంటున్నారు. ఈ క్రమంలో పట్టాభి సతీమణి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. తనతో పాటు టీడీపీ నేత బోడె ప్రసాద్ పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారని అన్నారు. 

 ప్రతి రోజు పట్టాభి వెంట ఇద్దరు ముగ్గురు ఉంటారని, వారు ఈ రోజు రాలేదని ఆమె తెలిపారు. ఇంటినుంచి బైటికి వెళ్లగానే దాడి జరిగిందని ఆమె చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇక పట్టాభిరామ్ పై దాడిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. 15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభిని గాయపర్చడంపై చంద్రబాబు మండిపడ్డారు. పట్టాభిరాంపై దాడి జరిగినట్లు తెలుసుకున్న వెంటనే ఆయనను పరామర్శించడానికి చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పట్టాభి ఇంటికి చేరుకున్నారు. గాయపడిని పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు రాళ్లదాడిలో ధ్వంసమైన కారును పరిశీలించారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను పట్టాభిని అడిగి తెలుసుకున్నారు. 
 

click me!