టీడీపీ , జనసేన కూటమిలో చేరాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిసైడ్ కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాకినాడ సిటీ నుంచి పెద్దాయనను పోటీకి దించాలని టీడీపీ నేతలు చెబుతున్నారట. ఈ స్థానం వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కంచుకోట.
టీడీపీ , జనసేన కూటమిలో చేరాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిసైడ్ కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాపులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ముద్రగడ కోసం అన్ని పార్టీలు కూచుకుని కూర్చొన్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీలో చేరుతారని, లేదంటే న్యూట్రల్‌గా వుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీడీపీ జనసేన కూటమి వైపు ముద్రగడ మొగ్గుచూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ఎత్తులపై ఈ రెండు పార్టీలు చర్చించుకుంటున్నాయి.
అయితే ముద్రగడ పద్మనాభం ఇంకా జనసేనలో చేరకముందే ఆయనను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి.. ఎంపీగానా, ఎమ్మెల్యేగానా అనే దానిపై రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ముద్రగడ పోటీపై జనసేనకు టీడీపీ కీలక సూచనలు చేసిందట. కాకినాడ సిటీ నుంచి పెద్దాయనను పోటీకి దించాలని టీడీపీ నేతలు చెబుతున్నారట. ఈ స్థానం వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కంచుకోట. పైగా ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ కళ్యాణ్ శపథాలు కూడా చేశాడు. పవన్ కోరిక తీరాలంటే ముద్రగడ పద్మనాభమే సరైన వ్యక్తి అని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
కాకినాడ సిటీలో కాపు, గంగపుత్రుల కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువగా. ప్రస్తుతం మత్స్యకార వర్గానికే చెందిన వనమాడి కొండబాబు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వున్నారు. పొత్తులో ఈ సీటును జనసేన కొరితే తెలుగు తమ్ముళ్ల నుంచి పెద్దగా ప్రతిబంధకాలు ఎదురుకావని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఉమ్మడి శత్రువుగా వున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించేందుకు పచ్చ శ్రేణులు కూడా కదలివచ్చే అవకాశాలు వున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. అసలు కాకినాడ సిటీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా అనేదే పెద్ద ప్రశ్న. ముద్రగడ, ద్వారంపూడి కుటుంబాల మధ్య దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలు వున్నాయి. కొద్దిరోజుల క్రితం ద్వారంపూడి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ముద్రగడ బహిరంగ లేఖ సైతం రాశారు. అలాంటిది ద్వారంపూడిపై తనను పోటీకి పెడితే పద్మనాభం ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లి, ఆయనను జనసేనలోకి ఆహ్వానించనున్నారు. ఆ సమయంలోనే ముద్రగడ పోటీకి సంబంధించిన విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లాలని కాకినాడ సిటీ టీడీపీ నేతలు భావిస్తున్నారు.