కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ... జగన్ పై రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు..

By AN TeluguFirst Published Nov 6, 2020, 9:43 AM IST
Highlights

జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నుంచి పది రోజుల పాటు పండగలా ఉత్సవాలు జరపాలని  సజ్జల  రామకృష్ణారెడ్డి ప్రకటించడంపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యంగ్యాంస్త్రాలు విసిరారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంటే ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్‌రెడ్డే ఎక్కువ పనిచేస్తున్నారన్న మాటల్లో నిజంలేదని మండిపడ్డారు.

జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నుంచి పది రోజుల పాటు పండగలా ఉత్సవాలు జరపాలని  సజ్జల  రామకృష్ణారెడ్డి ప్రకటించడంపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యంగ్యాంస్త్రాలు విసిరారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంటే ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్‌రెడ్డే ఎక్కువ పనిచేస్తున్నారన్న మాటల్లో నిజంలేదని మండిపడ్డారు.

రేపటినుండి పదిరోజుల పాటు జగన్ నామస్మరణ చేయమంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘జగన్, వైఎస్సార్‌తో సరిసమానంగా పనిచేస్తున్నారంటే కొంత నమ్మేవాడిని. అయినా, మా నాయకుడికి పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. ఆయన సింప్లిసిటీ కోరుకునే వ్యక్తి. అయితే సజ్జల... జగన్‌ను ఓ భగవంతుడిగా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌ వంటివారే రెండో పర్యాయం పాస్‌మార్కులతో అధికారంలోకి వచ్చారని గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమం రఘురామకృష్ణంరాజు అన్నారు.

 శుక్రవారం నుంచి పది రోజుల పాటు పండగలా ఉత్సవాలు జరపాలని  సజ్జల ప్రకటించడంపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ ‘‘జగన్‌ వంటి నేతలు ఈ తరంలో ఉండటం గొప్ప విషయం. ఈ తరమేకాదు ఏ తరంలో కూడా ఇంత గొప్ప నేత ఉండరు’’ అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. 

అంతేకాదు  శుక్రవారం స్టేట్‌ హాలిడేగా ప్రకటిస్తే పండగలా జరుపుకొంటామని వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘‘పదిరోజుల పాటు జగన్‌ నామస్మరణ చేయమని చెబుతున్నారు. నలభైఏళ్ల క్రితం బాపుగారు ‘రాజాధిరాజు’ సినిమా తీశారు. అందులో ‘కొత్తా దేవుడండీ... కొంగొత్తా దేవుడండీ‘ అనే పాట ఉంది అయితే, ఇంటింటా పండగలు చేసుకోవడం జగన్‌కు నచ్చవని నేను అనుకొంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

రచ్చబండను ప్రతిరోజూ కాకుండా వారానికి 2రోజులు నిర్వహించనున్నట్లు రఘురామరాజు ప్రకటించారు.  ప్రతి మంగళ, శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఉంటుందన్నారు. ‘‘ఏపీ రాజధాని ఏదో మీడియాకు కూడా తెలియని స్థితిలో ఉన్నాం. ఉమ్మడి రాజధాని గనుకనే హైదరాబాద్‌ను రచ్చబండ కోసం పరిశీలిస్తున్నాను.  

 వైఎస్సారే రచ్చబండ ప్రారంభించారు. అయితే ఆయన అకాల మరణం చెందడంతో ఆ కార్యక్రమం సాగలేదు. వైఎస్సార్‌ స్ఫూర్తితోనే నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమం వేదికగా గత 120రోజులుగా ఏపీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. జగన్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా, ఆయన ఇంతవరకు బయటకొచ్చిన పాపాన పోలేదు’’ అని దెప్పిపొడిచారు.
 

click me!