
సత్తెనపల్లి: ఆ తల్లికి ఎంతకష్టం వచ్చిందో ఏమో... ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నబిడ్డల ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడలేదు. నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసముంటోంది. అయితే కుటుంబకలహాలతో తీవ్ర మనోవేదనకు గురయిన మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. తాను లేకుంటే పిల్లల ఆలనాపాలనా చూసేవారు వుండరని ఆ తల్లి భావించినట్లుంది... అందుకే కేవలం ఒక్కరే కాకుండా ఇద్దరు బిడ్డలను తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకునే ఇద్దరు బిడ్డలతో కలిసి రైలుపట్టాల వద్దకు చేరుకున్న మహిళ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
రైలు కింద పడటంతో తల్లీ, ఇద్దరు బిడ్డల శరీరాలు చిద్రమైపోయాయి. రైలుపట్టాలను మృతదేహాలను గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతో అడవికి వెళ్లిన ముగ్గురు గల్లంతయిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది, తేనే కోసం అడవికి వెళ్లి వాగులో కొట్టుకుపోయిన ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా, ఒక్కరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గపల్లికి చెందిన తొమ్మిది మంది తేనెను తెచ్చేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇలా తేనెను సేకరిస్తూ ఉమ్మడి కడప జిల్లాలోని గోపవరం మండలం వల్లలవారిపాలెంకి చేరుకున్నారు. ఆదివారం అటవీ ప్రాంతంలో తేనేను సేకరించిన తొమ్మిది మంది రాత్రి కావడంతో అక్కడే నిద్రపోయారు. వీరు పడుకున్న చోట వాగు ఉంది. అయితే ఆదివారం నాడు అర్ధరాత్రి వాగు పై భాగంలో భారీ వర్షం కురిసింది.
ఈ వర్షంతో వాగు పొంగిపొర్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించని వారు నిద్రలోనే వాగులో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు వాగులో కొట్టకుపోయి చనిపోయారు. చనిపోయిన వారిని మామిళ్ల రమేష్, మామిళ్ల వెంగయ్యలుగా గుర్తించారు. స్థానికుల సహాయంతో ఇద్దరి డెడ్ బాడీలను పోలీసులు వెలికి తీశారు.