
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్‌తో సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే అసెంబ్లీలో వైసీపీకి భారీ బలం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అని అంతా భావించారు.
అయితే ఈ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు టీడీపీ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలో నిలపుతుందా? లేదా? అనేది ఈరోజు గానీ, రేపు గానీ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిని నిలిపిన పక్షంలో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
అయితే టీడీపీ అభ్యర్థిని బరిలో దింపడంతో ద్వారా.. పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి దూరమయ్యారు. వారు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి.. ఎన్నికల సమయంలో విప్ జారీచేయాలని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలు.. విప్‌ను ఉల్లంఘిస్తే వారిపై ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ ఆలోచనగా ఉంది.
అలాగే వైసీపీలోని అసంతృప్తులతో కూడా సంప్రదింపులు జరపాలనేది చంద్రబాబు వ్యుహాంగా కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి గెలిచినా, గెలవకపోయినా తమ వంతు ప్రయత్నం చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపుల అనంతరం చంద్రబాబు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.