విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా

By Sumanth KanukulaFirst Published Jun 4, 2022, 2:49 PM IST
Highlights

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం చోటుచేసుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖను పంపారు.

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం చోటుచేసుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రాజీనామా చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్‌గా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖను పంపారు. ఇక, 2019 ఎన్నికల్లో గెలిచిన వాసుపల్లి గణేష్.. ఆ తర్వాత వైసీపీకి మద్దతు తెలిపారు. అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత కొంతకాలంగా వాసుపల్లికి.. తొలి నుంచి వైసీపీలో ఉన్న నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. 

గణేష్ విషయానికి వస్తే.. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీపై విరుచుకుపడేవారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గణేష్.. వైసీపీకి మద్దతు పలికారు. దీంతో ఆయన వెంబడి కొంత టీడీపీ క్యాడర్‌ కూడా వైసీపీలోకి వచ్చింది. అయితే అప్పటికే నియోజవర్గంలో చాలా కాలంగా ఉన్న వైసీపీ నాయకులకు.. కొత్తగా వచ్చిన వాసుపల్లి వర్గీయులకు మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. అది పలు సందర్భాల్లో బహిరంగంగానే కనిపించింది. ఇరువర్గాలు నియోజవర్గంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. 

Latest Videos

ఇక, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధాకర్‌ని పరోక్షంగా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రోత్సహిస్తున్నారని వాసుపల్లి గణేస్ ఆగ్రహంగా ఉన్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తున్నారని గణేష్ అనుచరులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో తానే ఎమ్మెల్యే అంటూ చైర్మన్‌ సుధాకర్‌ ప్రచారం చేస్తున్నారని.. విజయసాయి అండతో నియోజకవర్గంలో సుధాకర్‌ జోక్యం చేసుకుంటున్నారని గణేష్ వర్గం చెబుతోంది. అయితే తాజాగా నియోజకవర్గం పార్టీ బాధ్యతలకు వాసుపల్లి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

click me!