
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సమయం గడిచిన కూడా అధికారులు మాత్రం మీడియా సమావేశానికి హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఫలితాల విడుదల వాయిదా పడినట్టుగా అధికారులు సమాచారం ఇచ్చారు. ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. అయితే సోమవారం (జూన్ 6) ఏ సమాయానికి ఫలితాలు విడుదల చేస్తారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల వాయిదా వేశామని అధికారులు చెబుతున్నారు.
‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సిన పదో తరగతి ఫలితాలు విడుదల చేసే కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. తల్లిదండ్రులు గమనించగలరు’’ అని గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు. అయితే పరీక్ష ఫలితాల విడుదల వాయిదాకు గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. మరో వైపు విద్యాశాఖ సమన్వయ లోపంతోనే ఫలితాల విడుదల వాయిదా కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. మరోవైపు.. ఫలితాల తరువాత విద్యాసంస్థలు ర్యాంకులకు ప్రకటనల రూపంలో ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.