
చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ వ్యవహారం సృతిమించుతోంది. చివరకు చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం కూడా చాలా చోట్ల రసాబాసగా తయారైంది. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. పార్టీలోని రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకుంటే మధ్యలో ఎంఎల్ఏకి గాయమైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే, జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోగల రెండో వార్డులో గురువారం ఇంటింటికీ తెలుగుదేశంపార్టీ కార్యక్రమం జరుగుతోంది. గుంతకల్లులో పార్టీలో రెండు వర్గాలున్నాయి. కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ ఎంపీటీసీ మస్తానమ్మ వర్గాలు ఎదరుపడ్డాయి. దాంతో మాటా మాట మొదలై పెరిగిపోయింది. చివరకు పరస్పరం దాడులకు దిగారు.
అయితే, అక్కడే ఉన్న ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. ఎంఎల్ఏ ఎంత ప్రయత్నంచినా శాంతించని వర్గాలు చివరకు ఎంఎల్ఏపైనే తిరగబడ్డాయి. ఇరువర్గాల వారు ఒక్కసారిగా ఎంఎల్ఏపైకి దూసుకువచ్చి తోసేయటంతో ఎంఎల్ఏ క్రిందపడిపోయారు. దాంతో ఆయన కాలికి గాయమైంది. ఇపుడు ఈ ఘటనపై జిల్లా పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అంతేగాక రెండు వర్గాలు వీధినపడి గొడవలు పడటమే కాకుండా ఎంఎల్ఏనే గాయపరచటంపై పార్టీ అధిష్టానానికి సమాచారం కూడా ఇచ్చారట.