15 ఏళ్ళయినా పోలవరం పూర్తి కాదు

First Published Dec 11, 2017, 10:39 AM IST
Highlights
  • ‘పనులు ఇపుడు జరుగుతన్న విధానంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కనీసం మరో 15 ఏళ్ళు పడుతుంది’

‘పనులు ఇపుడు జరుగుతన్న విధానంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కనీసం మరో 15 ఏళ్ళు పడుతుంది’ ..ఇది తాజాగా వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు. మూడు రోజుల క్రితమే వైసిపి ప్రజా ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు సైట్ ను సందర్శించిన సంగతి అందరకీ తెలిసిందే. ఆ విషయమై ఆళ్ళ ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, ప్రభుత్వం పోలవరంపై ప్రజలకు చెబుతున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది మరొకటన్నారు. పోలవరం ముసుగులో దారుణంగా కోట్ల రూపాయల ప్రజాధానం లూటీ జరిగిపోతోందని  ఆరోపించారు

.చంద్రబాబు వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా ప్రాజెక్టు పనులు మాత్రం పెద్దగా  జరగలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం చేసిన ఖర్చులో అత్యధికం లాభాలొచ్చే పనులను మాత్రమే ముందు చేపట్టినట్లు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత బిగించాల్సిన గేట్లను ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ ఇపుడే తయారు చేయిస్తోందని ఉదాహరణగా చెప్పారు. గేట్ల తయారీలో స్టీలును వాడుతారు కాబట్టి అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఫౌండేషన్ స్టేజిలోనే ఉన్న ప్రాజెక్టుకు గేట్ల తయారీతో ఏం పనంటూ మండిపడ్డారు. ఇటువంటి పనుల్లో అత్యధిక కిక్ బ్యాగ్స్ వస్తాయి కాబట్టి అటువంటి పనులపైనే ముందుగా దృష్టి పెట్టినట్లు ఆరోపించారు.

ప్రభుత్వం నుండి కాంట్రాక్టు సంస్ధ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎక్కువ తీసేసున్నట్లుగా ఆళ్ళ అనుమానం వ్తక్యం చేశారు. అలా తీసుకున్న మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంస్ధకు అవసరమైన మెషినరీ అంటే, పొక్లైనర్లు, డోజర్లు, ఎస్కవేటర్లు, మెటల్ కోసం వాడే క్రషింగ్ మెషీన్లు కొనుగోలు చేసినట్లు ఎంఎల్ఏ అభిప్రాయపడ్డారు. అందువల్లే కోట్లాది రూపాయలు వ్యయం చేసినట్లు కనబడుతున్నా పనులు మాత్రం జరగలేదన్నారు.

పనులు జరుగుతున్నట్లు చూపించటానికి బాగా డబ్బులు మిగిలే మట్టిపని, రాక్ కటింగ్ (కొండను తొలవటం) పనులు మాత్రం చేస్తున్నారని ఆరోపించారు. ఇపుడు జరుగుతున్న విధానంలోనే పోలవరం పనులు గనుక జరిగితే ప్రాజెక్టు పూర్తవ్వటానికి కనీసం ఇంకో 15 ఏళ్ళు పడుతుందని ఆళ్ళ అభిప్రాయపడ్డారు.

 

click me!