మైనర్ బాలుడిని చితకబాదిన పోలీసులు... కుటుంబసభ్యులపైనా దౌర్జన్యం

By Arun Kumar PFirst Published Apr 9, 2020, 12:30 PM IST
Highlights

పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న ఓ మైనర్ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషాద సంఘటన ఉయ్యూరులో చోటుచేసుకుంది. 

అమరావతి: 17 ఏళ్ల మైనర్ బాలుడు పై ఉయ్యూరు రూరల్ పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారు. బాలుడిని కర్రతో కాళ్లమీద ఇష్టం వచ్చినట్లు బాదారు. దీంతో   అరి కాళ్ళకు తీవ్ర గాయమై నడవలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా బాలుడి చేతులు వంగ తీసి... తల గోడకేసి గుద్దినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం  తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉయ్యూరుకు చెందిన బాలుడిని పట్టుకున్న స్థానిక పోలీసులు చితకబాదారు.  విచ్చలవిడిగా కొట్టడంతో కళ్ళు తిరిగి పడిపోయిన మైనర్ బాలుడు గుట్టుచప్పుడు కాకుండా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లవాడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెళ్తే  వారిపై దురుసుగా ప్రవర్తించారు రూరల్ పోలీసులు.

ఆరు నెలల వయసు నుంచి గుండె సమస్యతో బాధపడుతున్న తమ కొడుకును చితకబాదడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  అధికారం ఉందని తమ కొడుకుని చంపేస్తారా? అంటూ పోలీసులను నిలదీశారు. 

 కుటుంబ సభ్యులపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన విషయం మీడియాకు లీక్ అవడంతో చికిత్స పొందుతున్న మైనర్ బాలుడిని, కుటుంబ సభ్యులను బెదిరించి పోలీసులు ఇంటికి పంపించినట్లు సమాచారం. స్టేషన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ట్రైనింగ్ ఏసిపి ఈ దాష్టికానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రైనింగ్ ఏసిపి బెదిరింపులతో సర్దుకుని బాధిత మైనర్ బాలుడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు.    

మైనర్ బాలుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో విచ్చలవిడిగా కొట్టారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పిల్లాడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
 
 

click me!