వాళ్ల ట్రాప్‌లో పడొద్దు.. ర్యాలీలు చేస్తే గెలిచినట్లేనా, ఇప్పటికైనా చర్చలకు రండి: ఉద్యోగులకు వెల్లంపల్లి సూచన

Siva Kodati |  
Published : Feb 04, 2022, 02:26 PM IST
వాళ్ల ట్రాప్‌లో పడొద్దు.. ర్యాలీలు చేస్తే గెలిచినట్లేనా, ఇప్పటికైనా చర్చలకు రండి: ఉద్యోగులకు వెల్లంపల్లి సూచన

సారాంశం

ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు పడ్డాయని, జీతాల్లో తగ్గుదలగానీ, ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్టుగానీ పే స్లిప్పుల్లో ఉందా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, ఆ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. 

ఉద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampally srinivas) . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఒక అడుగు ముందుకేసి చర్చలకు వస్తే.. ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, భారీ ర్యాలీలు చేసినంత మాత్రాన తమపై పైచేయి సాధించినట్టు కాదని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మంచి మనసున్న నేత అని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగులందరికీ 27 శాతం ఐఆర్ ఇచ్చారని వెల్లంపల్లి గుర్తు చేశారు.

ప్రభుత్వం, సీఎంపై నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని శ్రీనివాస్ హితవు చెప్పారు. ఉద్యోగులను చూసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు పడ్డాయని, జీతాల్లో తగ్గుదలగానీ, ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్టుగానీ పే స్లిప్పుల్లో ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, ఆ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ వెల్లడించారు. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల గురించి అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు. కరోనా వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ర్యాలీ వద్దన్నామని, ప్రభుత్వం ఆంక్షలు పెడితే ఇంత మంది వచ్చేవారా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఉద్యోగులను వేధించి బాధపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన హితవు పలికారు. 

మరోవైపు జగన్ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ (PRC)ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న(గురువారం) ఛలో విజయవాడ (Chalo Vijayawada)ను విజయవంతం చేసుకున్న ఉద్యోగులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసారు. తమ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్ (pen down) చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరష్కరించే వరకు విధులకు దూరంగా వుంటామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేసారు. 

ఇప్పటికే పీఆర్సీ నిరసలను ఉదృతం చేస్తూ ఈ నెల 7వ తేదీ(సోమవారం) నుండి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ఉద్యోగులు ఓరోజు ముందుగానే తమ సమ్మెను ప్రారంభించారు. రేపు, ఎల్లుండి(శని,ఆదివారం) సెలవురోజుల కావడంతో ఇవాళ్టినుండి విధులకు దూరంగా వుండాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెన్ డౌన్ ,యాప్ డౌన్ చేపట్టారు. 

ఇదిలావుంటే నిన్న(గురువారం) ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతం కావడంతో పీఆర్సీ సాధన సమితి కూడా స్పీడ్ పెంచింది. ఓవైపు ప్రభుత్వంతో చర్చలగురించి సమాలోచనలు చేస్తూనే మరోవైపు సమ్మెను సక్సెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఛలో విజయవాడ మాదిరిగానే ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చి సమ్మెలో పాల్గొనేలా చేయడంద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu