
ప్రజలు తనను సినిమా హీరోగా చూస్తున్నారా.. లేదా ఓ రాజకీయ నాయకుడిగా చూస్తున్నారో ముందు పవన్ ఆలోచించుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ లెక్క ప్రకారం.. జిల్లా కలెక్టరుగా పని చేయాలంటే ముందు బిల్ కలెక్టరుగా పనిచేయాలేమోనని ఎద్దేవా చేశారు. ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ వ్యాఖ్యానించడం ఆయన పరిణితికి అద్దం పడుతోందన్నారు.
తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదాట్లో కలిపేస్తా.. ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదని.. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా? అని ప్రశ్నించారు. మోడీతో జగన్-పవన్ ప్రయాణం ఖాయమైందని.. ఇది ప్రజల అభిప్రాయమని అన్నారు. వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్..., తన అన్న వారసత్వం నుంచే తాను రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు.