లోకేష్ ఐరన్ లెగ్.. పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలు భయంతో ఉన్నారు: మంత్రి రోజా సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 4:25 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్‌ లెగ్ అని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్‌ లెగ్ అని విమర్శించారు. శనివారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తన తండ్రిని అభిమానించే వారందరి కష్టాలను తీర్చడానికి భరోసా ఇస్తూ పాదయాత్ర చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలను జగన్ నెరవేర్చారని తెలిపారు. 

దొడ్డిదారిలో మంత్రి అయిన లోకేష్.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీని విలీనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం జరిగిందని అన్నారు. 44 వేల పర్మినెంట్‌ ఉద్యోగాలు వైద్య రంగంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు పోలీసు రిక్రూట్‌మెంట్ కూడా జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఉద్యోగాలు రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 

నారా లోకేష్ ఐరన్ లెగ్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ పాదయాత్రలో తొలిరోజే పదాలు పలకలేక తడబడ్డాడని విమర్శించారు. అతడు లోకేష్ కాదని.. పులకేష్ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘లోకేష్ మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే వాళ్ళ నాన్నకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి. మొన్న పాదయాత్ర పోస్టర్ లాంచింగ్ చేస్తే కందుకూరులో 8 మంది చనిపోయారు. నిన్న పాదయాత్ర మొదలుపెడితే తారకరత్న గుండెపోటు వచ్చింది’’ అని రోజా అన్నారు. తారకరత్నకు గుండెపోటు వస్తే చంద్రబాబు, లోకేష్‌లు పట్టించుకోలేదని విమర్శించారు. 

ఇలాంటి ఐరన్ లెగ్ రాష్ట్రమంతా నడిస్తే మా పరిస్థితి ఏమిటని ప్రజలు భయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారిని దేవుడు కాపాడాలని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  చంద్రబాబు, లోకేష్‌లకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత పెరిగిందని అన్నారు. 
 

click me!