
తెలుగుదేశం పార్టీ, జనసేనలపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేనకు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. మీటింగ్‌లకు వచ్చే జనాన్ని చూసి సీఎం అవుతానని అనుకుంటున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టగలననే నమ్మకం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరారు.
జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరని.. అలాంటిది అసెంబ్లీ మీద జెండా ఎగరవేస్తారంటా? అని విమర్శించారు. ముందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలవాలని.. ఆ తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలని అన్నారు.
పవన్ కల్యాణ్‌ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి సినిమా ఇండస్ట్రీలోని హీరోలంతా సిగ్గుపడుతున్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేశారని చెప్పారు. అలాగే చిరంజీవి పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేశారని.. అదే రక్తం పంచుకుని పుట్టిన పవన్ కల్యాణ్ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారని విమర్శించారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని ఉంటే.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పారిపోయి వచ్చిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆరోజు షూటింగ్‌లో ఉన్నావా? సూట్‌కేసులు తీసుకున్నావా? అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదని.. చంద్రబాబు కోసమని ఈరోజు మరోసారి స్పష్టమైందని అన్నారు.
చంద్రబాబు రైతు ద్రోహి అని.. ఎవరిని అడిగిన ఇదే మాట చెబుతారని అన్నారు. చంద్రబాబుది అధికార దాహం అని విమర్శించారు. నారా లోకేష్ అడుగుపెట్టగానే టీడీపీ పూర్తిగా పతనం అయిందని అన్నారు. ఏపీ ప్రజలు జగన్ వైపే ఉన్నారని.. స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అడ్డా అని అన్నారు.