లోకేష్ యువగళం ప్రకటించిన రోజే 8 మంది మృతిచెందారు: టీడీపీపై మంత్రి రోజా విమర్శలు..

By Sumanth KanukulaFirst Published Dec 29, 2022, 12:33 PM IST
Highlights

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చోటుచేసుకనున్న తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు 8 మంది మృతికి   కారణమయ్యారని విమర్శించారు.

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చోటుచేసుకనున్న తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు 8 మంది మృతికి   కారణమయ్యారని విమర్శించారు. చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా  కేసు నమోదు చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు టీడీపీ రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ యువగళం ప్రకటించిన రోజే 8 మంది మృతిచెందారని అన్నారు. 

ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనురిస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు నిరసనగా ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కందకూరులో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం.. సభ జరుగుతున్న సమయంలో ప్రజల్లో కొంత తోపులాటలు చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగానే.. తొక్కిసలాట చోటుచేసుకుని కొందరు వ్యక్తులు సమీపంలోని కాలువలో పడిపోయారు. వెంటనే సభను ఆపేసిన టీడీపీ నేతలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంత మంది గాయాలతో మృతి చెందగా, మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. 

చంద్రబాబు నాయుడకు కూడా సభను నిలిపివేసి.. ఆస్పత్రి వద్దకు బాధితులను పరామర్శించారు. అనంతరం తిరిగి బహిరంగ సభ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడు..జరిగిన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ సమావేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో చదవుకునేవారుంటే.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలందరూ మృతుల కుటుంబాలకు అండగా ఉండి.. అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. చనిపోయిన వారికి సంతాపం  ప్రకటిస్తూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వెంటనే సభను ముగించారు. ఇక, చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!