నువ్వు వకీల్ సాబ్‌వా.. ఎప్పుడు చదివావ్ చిడతల నాయుడు: పవన్‌‌కు పేర్ని నాని కౌంటర్

By Siva KodatiFirst Published Dec 29, 2020, 4:20 PM IST
Highlights

స్నానం చేయకపోతే, మెడ రుద్దుకుంటూ, మట్టి నలుపుకుంటూ ఉండే వ్యక్తేనా పవన్ కల్యాణ్ అంటే అంటూ మంత్రి సెటైర్లు వేశారు. చీడతలు వాయిండంలో కూడా డబ్బు సంపాదించడం ఎవరి వల్లనైనా అయ్యిందంటే ఈ భూ ప్రపంచం మీద మన చిడతల నాయుడుకేనంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు

గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిల కింద ఎగనామం పెట్టిన రూ.904 కోట్లను జగన్ ప్రభుత్వమే తీర్చిందన్నారు మంత్రి పేర్ని నాని. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అలాగే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్‌లో రూ. 510 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి వెల్లడించారు.

భారీ వర్షాలు, తుఫాన్‌ల కారణంగా నష్టపోయిన రైతాంగానికి రూ.1,038 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని నాని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు డబ్బు చెల్లించకుండా ఎగనామం పెట్టిన బకాయిల్లో రూ.960 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు.

అలాగే ఉచిత విద్యుత్, ఆక్వా రంగంలోని రైతులను ప్రోత్సహించేందుకు రూ.17,430 కోట్లను జగన్ సర్కార్ వెచ్చిందని చెప్పారు. ఉచిత విద్యుత్ పగటి పూట మాత్రమే ఇవ్వాలనే లక్ష్యంతో ఫీడర్లను సిద్ధం చేసేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశామని నాని తెలిపారు.

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విత్తన బకాయిలు రూ.383 కోట్లను చెల్లించామన్నారు. మొత్తంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 18 నెలల కాలంలో రూ. 61,400 కోట్లను రైతుల కోసం వెచ్చిందని పేర్ని నాని గుర్తుచేశారు.

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు, అడవి పట్టాలు పొందిన వారికి, దేవుడు మాన్యం కౌలు చేస్తున్న వారికి, అసైన్డ్‌మెంట్ భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారికి ఒక్క ఏపీలో మాత్రమే రైతు భరోసాని అందజేస్తున్నామన్నారు.

స్నానం చేయకపోతే, మెడ రుద్దుకుంటూ, మట్టి నలుపుకుంటూ ఉండే వ్యక్తేనా పవన్ కల్యాణ్ అంటే అంటూ మంత్రి సెటైర్లు వేశారు. చీడతలు వాయిండంలో కూడా డబ్బు సంపాదించడం ఎవరి వల్లనైనా అయ్యిందంటే ఈ భూ ప్రపంచం మీద మన చిడతల నాయుడుకేనంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

తనకు రాజశేఖర్ రెడ్డి అంటే గుండెల నిండా అభిమానం వుందని, చనిపోయే వరకు వైఎస్ గురించి తప్పించి ఇంకొటి మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ను కూడా అంతే అభిమానిస్తానని పేర్ని నాని వెల్లడించారు.

చిడతలు వాయించినా, భజన చేసిన వైఎస్ కుటుంబానికే చేస్తానని చెప్పారు. మరణిస్తూ కూడా రాజశేఖర్ రెడ్డికి భజన చేస్తూ చనిపోతానని ఆయన తెలిపారు. 2013-14 సంవత్సరంలో హైదరాబాద్‌లో బాగా ఖరీదైన హైటెక్స్‌లో మీటింగ్ పెట్టి, విలేకరులను, అమాయకులైన ఫ్యాన్స్‌ని పిలిచి అక్కడ చిడతలు ఎవడికి కొట్టాడంటూ ప్రశ్నించారు.

సోనియా గాంధీకి రివర్స్ చిడతలు, మోడీకి చిడతలు.. నెల తిరగకుండానే చంద్రబాబు నాయుడికి చిడతలు కొట్టారని నాని ఎద్దేవా చేశారు. చిడతలు కొట్టడంలో లాభం పొందింది పవనే అన్నారు. 2014-17 దాకా చంద్రబాబుకు చిడతలు కొట్టారని.. మోడీని మరిచిపోయారని, అసలు ఎవరో తెలియదంటూ చెప్పారని నాని గుర్తుచేశారు.

ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టాడని చెప్పి.. ప్రశ్నించడం మరిచిపోయాడని సెటైర్లు వేశారు. 2017లో చంద్రబాబు మళ్లీ రివర్స్ చిడతలు కొట్టాడని, 2019లో మళ్లీ అనుకూలంగా చిడతలు కొట్టారని నాని మండిపడ్డారు.

ఆ ఎన్నికల్లో బాబు ఓడిపోగానే, మోడీకి చిడతలు కొట్టారని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులకు చిడతలు కొట్టారని.. ఆ తర్వాత ఎర్ర చిడతలను పక్కనపడేసి, కాషాయ చిడతలను పట్టుకున్నాడంటూ ధ్వజమెత్తారు.

2014 నుంచి 2019 వరకు పంట నష్టపోయిన వారికి జనసేన మద్ధతున్న టీడీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందని నాని ప్రశ్నించారు. అప్పుడు ఇచ్చినదాని కంటే అర్థ రూపాయి ఎక్కువే ఇచ్చామని పేర్ని నాని చెప్పారు. పవన్ వకీల్ ఎప్పుడు అయ్యారు.. ఆయన ప్లీడర్ చదివారా, ఏ యూనివర్సిటీలో అంటూ నాని ప్రశ్నించారు.

ఈయన వకీల్ అన్నది ఎంత నిజమో.. పవన్ రాజకీయం కూడా అంతేనంటూ దుయ్యబట్టారు. కొడాలి నాని అంటే పవన్‌కు భయమని అందుకే ఎక్కడా ఆయన పేరేత్తలేకపోయారని నాని ఎద్దేవా చేశారు. 

click me!