జగన్‌పై కక్ష, టీడీపీ బాగుండాలి.. చంద్రబాబుతో వెళ్తున్నామని చెప్పడానికే సభ: పవన్‌కు పేర్ని నాని కౌంటర్

Siva Kodati |  
Published : Mar 14, 2022, 10:14 PM ISTUpdated : Mar 14, 2022, 10:16 PM IST
జగన్‌పై కక్ష, టీడీపీ బాగుండాలి.. చంద్రబాబుతో వెళ్తున్నామని చెప్పడానికే సభ: పవన్‌కు పేర్ని నాని కౌంటర్

సారాంశం

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే పవన్  లక్ష్యమని.. టీడీపీతో వెళ్తున్నామని  చెప్పడానికే ఇప్పటంలో సభ పెట్టారని నాని ఆరోపించారు.

జనసేన ఆవిర్భావ సభలో (janasena formation day) పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన  వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని (perni nani) . నమస్కారం పెట్టకపోతే.. తనకు సంస్కారం లేదని అనుకుంటారంటూ చురకలు వేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, సీపీఐ రామకృష్ణ, కాంగ్రెస్, సోనియా గాంధీలకు నమస్కారం తెలిపారు మంత్రి పేర్ని నాని. పవన్ ఎప్పుడు తమ పార్టీలో దూకుతారోనని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం పెట్టిన పవన్.. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం ఆయన సంస్కారమంటూ దుయ్యబట్టారు. టీడీపీ బాగుండాలనేది పవన్ ఆకాంక్ష అని... జగన్ అధికారంలోకి రాకూడదనేదే పవన్, చంద్రబాబు లక్ష్యమన్నారు. 

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశం బాబు (chandrababu) పాలనలో మీకు ఎందుకు లేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని అనిపించిందా అని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ అసలు వున్నారా అని నాని ప్రశ్నించారు. మానసిక అత్యాచారం చేసేందుకు మీకు లైసెన్స్ వుందా అని మంత్రి మండిపడ్డారు. దేశ , రాష్ట్ర ప్రయోజనాలని ఉపోద్ఘాతాలు చెబుతున్నారని.. మీ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేసి పెట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. 

బీజేపీ, టీడీపీలకు కలిపేందుకు పవన్ ప్రయత్నించారని.. చంద్రబాబు, పవన్ ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారని మంత్రి నిలదీశారు. వెల్లంపల్లి వెల్లుల్లి, ర్యాంబో రాంబాబు అంటూ మీరు మాట్లాడొచ్చా అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆడ, మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చేయొచ్చా అని మంత్రి నిలదీశారు. రాజధాని గ్రామాల్లో రైతులకు వైసీపీ మాత్రమే అండగా నిలిచిందని పేర్ని నాని స్పష్టం చేశారు. జనసేన మనసులో కర్నూలే (kurnool) రాజధాని అని అప్పుడు పవన్ చెప్పారని.. రాజధాని విషయంలో పూటకో మాట మారుస్తున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు. సిద్ధాంతాలపై ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ ఇలా మాట్లాడటం సరికాదని.. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని పేర్ని నాని పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్‌ను నడిపించే శక్తి బీజేపీయేనని (bjp) ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్ ఏదని కేంద్రాన్ని అడగరా..? కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టమని అడగలేరా అంటూ మంత్రి మండిపడ్డారు. గదుల్లో ఒకమాట.. గల్లీల్లో ఒక మాట అంటూ పేర్ని నాని చురకలు వేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయొద్దని కేంద్రాన్ని  నిలదీయాలని.. సినిమా డైలాగులే సభలో మాట్లాడారని మంత్రి దుయ్యబట్టారు. రాజకీయాలు వేరని.. సినిమాలు వేరని, కంఠం పవన్‌ది.. భావం చంద్రబాబుదని పేర్ని నాని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ ఒక్క మాట కూడా అనలేదని.. వైసీపీ నేతలకు తొడలు కొట్టే అలవాటు లేదన్నారు. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యమని నాని ఆరోపించారు. 

పవన్ కల్యాణ్ రాజకీయ ఊసరవెల్లి అన్న ఆయన.. వైసీపీకి కమ్మవారిని ఎందుకు దూరం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు మాత్రం వ్యతిరేక ఓటు చీలకూడదట అంటూ మండిపడ్డారు. ఎంతమంది ఎదురొచ్చినా జగన్ ఒంటరిగానే పోరాటం చేస్తారని.. ప్రతీ ఎన్నికల్లో పవన్ ఏ గుర్తుకు ఓటు వేయమంటాడో తెలియక జనసైనికుల్లో గందరగోళం వుందన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ జంపింగ్ జపాంగ్‌లా పవన్ దూకుతున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ కంటే ఊసరవెల్లి నయమన్న ఆయన.. చంద్రు అనే న్యాయవాది మాట్లాడితే, చంద్రబాబు దగ్గర నుంచి అందరూ తిట్టిపోశారని పేర్ని నాని గుర్తుచేశారు. 

గాంధారిలా మీరూ కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ మంత్రి ప్రశ్నించారు. సింగిల్‌గా వెళ్తామనే ధైర్యం లేదని.. నేను చంద్రబాబుతో వెళ్తానని చెప్పొచ్చుకదా, ఈ డొంక తిరుగుడు ఎందుకు అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. నేను సింగిల్ కాదు మింగిల్ అని చెప్పొచ్చు కదా అని సెటైర్లు వేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగినవి సహజ మరణాలని పేర్ని నాని స్పష్టం చేశారు. టీడీపీ అప్పు చేస్తే తప్పుకాదని.. వైసీపీ అప్పు చేస్తే మాత్రం తప్పు అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అప్పు చేయకుండానే పరిపాలన చేస్తున్నారా అని పేర్ని నాని ప్రశ్నించారు. 

కొత్తగా నామాలు పెట్టుకుని హిందూ దేవాలయాలు ధ్వంసం చేశామని చెబుతున్నారని.. ఎండోమెంట్ చట్టాన్ని టీడీపీ హయాంలో ఎందుకు మార్చలేదని మంత్రి నిలదీశారు. జగన్ అంటే కక్ష, ద్వేషమని.. మీరు ఏపీకి గెస్ట్, టూరిస్ట్ వంటి వారంటూ సెటైర్లు వేశారు. నేను చంద్రబాబుతోనే పనిచేస్తానని నిజాయితీగా చెప్పొచ్చుగా.. జన సైనికులంతా టీడీపీ జెండాలు మోయడానికి సిద్ధంగా వుండాలని చెప్పడానికే సభ పెట్టారంటూ పేర్ని నాని చురకలు వేశారు. పవన్ సినిమా డైలాగుల్ని ఎంజాయ్ చేయాలని.. సీరియస్‌గా తీసుకోవద్దని మంత్రి సూచించారు. మూడు వేల కోట్లతో టెండర్లు వేసి రోడ్ల పనులు చేపట్టామని పేర్ని నాని తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu