
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం సైకో పాలన సాగుతోందంటూ వైసిపి (ysrcp)ప్రభుత్వం, సీఎం జగన్ (ys jagan) పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) విమర్శలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandrareddy) కౌంటరిచ్చారు. చంద్రబాబు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుని ఏపిలో పాలనపై బురద జల్లుతున్నారని... విమర్శించే ముందు ఏపి ప్రజల మనోభావం తెలుసుకుంటే మంచిదన్నారు. టిడిపి నాయకులకు మాత్రమే ఇది సైకో పాలనలా కనిపిస్తుందని... కానీ చంద్రబాబు హయాంలోని 14ఏళ్లపాటు సైకో పాలన సాగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
''వైసీపీ ప్రభుత్వాన్ని, సిఎం వైఎస్ జగన్ ని కించపరిచేందుకు మాత్రమే చంద్రబాబు రాష్ట్రంలో పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలకు మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తుంటుంది'' అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
వీడియో
''గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసిపి, వైఎస్ జగన్ పై నమ్మకంతో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపిలను గెలిపించారు. వారి నమ్మకమే నిజమై సంక్షేమ పాలన సాగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలన ప్రజల దృష్టిలో సంక్షేమ పాలన'' అని అన్నారు.
''డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టిడిపిదే... వైసిపిలో అలాంటి సంస్కృతి లేదు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా వైసిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం'' అని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
''జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ కుటుంబమూ ఆర్థికంగా చితికిపోకుండా ఆడుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచింది. ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకే వెళ్లేలా... ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు-నేడు పథకారికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్ ను భారీ నిధులతో కార్పోరేట్ స్థాయిలో ఆధునికరిస్తున్నాం'' అని మంత్రి తెలిపారు.
''కడుపులోని బిడ్డ నుండి వయసుమీదపడ్డ అవ్వతాతల వరకు అందరికీ వైసిపి ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందిస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అమ్మ ఒడి, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధ్యయనాలు చేస్తున్నాయి. 14 ఏళ్లలో మీరు ఇంత గొప్పగా ఏం చేశారో చెప్పగలరా?'' అని చంద్రబాబును నిలదీసారు.
''ఉగాది పండగ నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు పూర్తవుతుంది. లాంఛనంగా తెలుగు సంవత్సరాది ఉగాది రోజునే కొత్త జిల్లాలు ఏర్పాటు జరుగుతుంది. గతంలో జిల్లాలు సుదీర్ఘ ప్రాంతాలు ఉండటంతో పాలనలో ఇబ్బందులు ఉండేవి. ఉదాహరణకు మదనపల్లె భారత దేశంలోనే పెద్ద డివిజన్ గా వుంది. ఇలాంటి చోట్ల ఇదివరకు పాలన కష్టతరంగా వుండేది. ఇప్పుడు జిల్లాల విభజన వలన అధికారులకు కూడా పాలనపై పట్టు ఉంటుంది'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.