
గుంటూరు: తన తొమ్మిదేళ్ల కొడుకుపై చర్చి పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.తన కొడుకుతో అసభ్యంగా వ్యవహరించిన పాస్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో సదరు పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ చర్చిలో అహరోన్ ప్రకాష్ పాస్టర్ గా పనిచేస్తున్నారు. దైవారాదన చేస్తూ పదిమందికి మంచిని బోధించే ఈ పాస్టరే పాడుపని చేసాడని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. తన తొమ్మిదేళ్ళ కొడుకుపై పాస్టర్ ప్రకాష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసాడు. బాలుడి తండ్రి పాస్టర్ పై లైంగిక ఆరోపణలే కాదు పోలీసులకు కూడా పిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు అహరోన్ ప్రకాష్ ను అరెస్ట్ చేసారు.
అయితే పాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న బాధిత కుటుంబాన్ని ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ మనోరంజని బెదిరింపులకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాస్టర్ కు మద్దతుగా వుంటూ బాధిత కుటుంబానిదే తప్పన్నట్లుగా ఆమె మాట్లాడినట్లుగా వున్న వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ వ్యవహారంపై మనోరంజని స్పందించారు. గతంలో ఓ వాహనానికి సంబంధించి రూ.1.50లక్షలు పాస్టర్ కు బాలుడి తండ్రి ఇవ్వాల్సి వుందని... ఆ డబ్బులను ఎగ్గొట్టడానికే తప్పుడు కేసు పెట్టినట్లుగా కొందరు పాస్టర్లు తనకు తెలిపారన్నారు. దీంతో తాను పాస్టర్ కు అండగా వున్న మరికొందరు పాస్టర్లతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లానని... అయితే అక్కడ కేసు మరోలా వుందని తెలిసిందన్నారు. బాలుడిపై పాస్టర్ ప్రకాష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కేసు పెట్టినట్లు తెలియడంతో తాను ఇందులో జోక్యం చేసుకోదల్చుకోలేదని... అందువల్లే అక్కడినుండి వెళ్ళిపోయినట్లు మనోరంజని తెలిపారు.
అయితే కొందరు తనవద్దకు వచ్చి ఈ కేసును సెటిల్ చేయాలని కోరారని... అందుకోసంరూ.20లక్షలు ఇస్తామని ఆశచూపారని మనోరంజని వెల్లడించారు. కానీ తాను అందుకు ఒప్పుకోకపోవడంతో పాస్టర్ కు మద్దతిస్తూ బాధిత బాలుడి కుటుంబానికి బెదిరించినట్లుగా వున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని ఫోన్ చేసి బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. అన్నట్లుగానే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారన్నారు. ఈ బెదిరింపై ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ కూడా తనవద్ద వుందని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ మనోరంజని వెల్లడించారు.