ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్లోలో మాట్లాడేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్లోలో మాట్లాడేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కుప్పం పర్యటనలో సీఎం జగన్ ఇచ్చిన హామీని గుర్తుచేసే ప్రయత్నం చేశారు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పబోయి... ముఖ్యమంత్రిని చేస్తారని మంత్రి నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఏపీ సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే కుప్పంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి తరుచూ కుప్పంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రజల్ని నమ్ముకుని రాజకీయాలు చేశానని.. దొంగ ఓట్లను నమ్ముకుని కాదని అన్నారు. తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉంటే ఎవరైనా వెంటనే తొలగించుకోవచ్చునన్నారు. ఎవరు దొంగ ఓట్లతో గెలిచారో ప్రజలకు తెలుసునని అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో 12 వేల దొంగ ఓట్లు ఇప్పటి వరకు తొలగించామని, ఇంకా 26వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామని చెప్పారు.