
Minister Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9:16 గంటలకు తుదిశ్వాస విడిచారు.
గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం పరంగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిత్యం జిమ్ లో కసరత్తు చేస్తూ.. ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఈ విధంగా గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఆ చివరి గంటన్నరలో అసలేం జరిగింది?
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేసింది. మంత్రి మేకపాటి చివరి గంటన్నరలో అసలేం జరిగిందో వివరించింది అపోలో వైద్యబృందం. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనను సుమారు 7.45 గంటల సమయంలో జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి మంత్రిని తీసుకువచ్చారు.
ఆస్పత్రికి వచ్చే సరికే ఆయన తీవ్ర గుండెపోటుకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే ERలో చేర్చారు. అప్పటికే ఆయన స్పందించలేదు, శ్వాస తీసుకోలేదు. నాడీ అందకపోవడంతో అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్, కార్డియాలజిస్ట్ లు, క్రిటికల్ కేర్ డాక్టర్లు సహా ఆస్పత్రిలో ఉన్న స్పెషలిస్టులంతా ఆయనను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు 90 నిమిషాల పాటు వైద్యులంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా .. తమ సాయశక్తులా ప్రయత్నించినా మంత్రి మేకపాటి గౌతమ్ ను బ్రతికించ లేకపోయారు. ఉదయం 9.16 గంటలకు ఆయన మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.