వారాహి కాదు ‘‘నారాహి’’ అని పెట్టుకోవాల్సింది : పవన్‌ ప్రచార వాహనంపై జోగి రమేశ్ సెటైర్లు

By Siva KodatiFirst Published Dec 9, 2022, 9:51 PM IST
Highlights

రాష్ట్రవ్యాప్త పర్యటన నిమిత్తం సిద్ధం చేసుకున్న ‘‘వారాహి’’ వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి జోగి రమేశ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి జోగి రమేశ్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తన వాహనానికి వారాహి అని కాకుండా నారాహి అంటే సరిపోతుందంటూ సెటైర్లు వేశారు. 175 స్థానాల్లో జనసేన అభ్యర్ధులే వుంటాని పవన్ చెప్పగలరా అని జోగి రమేశ్ సవాల్ విసిరారు. పవన్ ఒక పగటి వేషగాడన్న ఆయన.. చంద్రబాబు ఏ గడ్డ కరవడానికైనా సిద్ధంగా వుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అటు వారాహిపై పేర్ని నాని సెటైర్లు వేశారు. యుద్ధం చేయడానికి వ్యాన్‌లు కావాలా అని ప్రశ్నించారు. డబ్బులు పెట్టి వ్యాన్‌లు కొంటే యుద్ధం చేసినట్లా అని నిలదీశారు. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. ఆర్మీ రంగు వాడకూడదన్నారు పేర్ని నాని. ఆ రంగు వుంటే రిజిస్ట్రేషన్ కాదన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు.  మరోవైపు పవన్ చేసిన ట్వీట్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. శ్వాస తీసుకో.. ప్యాకేజ్ వద్దు అంటూ ట్వీట్ చేశారు. 

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు జనసేన నాదెండ్ల మనోహర్. జనసేన ఏనాడూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదన్నారు. వారాహి వాహనంలో ఇంకా మార్పులు వున్నాయని, ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధం చేస్తుంటే భయమెందుకని నీలదీశారు మనోహర్. 

Also Read:‘‘వారాహి’’పై వివాదం : ఊపిరి కూడా ఆపేయమంటారా .. మీరే చెప్పేయండి, వైసీపీ నేతలపై పవన్ ఫైర్

ఇదిలావుండగా... గ్రీన్ రంగును సామాన్యులు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమన్న వైసీపీ నేతల విమర్శకు ... గ్రీన్ రంగు కార్లు, బైకులను తన వారాహి వాహనం ఫోటోతో కలిపి ట్వీట్ చేశారు పవన్. రూల్స్ ఒక్క పవన్ కల్యాణ్‌కేనా అంటూ ఆయన ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో పచ్చని చెట్లను పోస్ట్ చేసిన పవన్.. ఈ గ్రీన్‌లో వైసీపీకి ఏ గ్రీన్ అంటే ఇష్టమో చెప్పాలని నిలదీశారు. ఇక 80వ దశకంలో బాగా పాపులర్ అయిన ఒనిడా టీవీ ప్రకటనను కూడా పవన్ ట్వీట్ చేశారు. మన గర్వం పక్కవాడికి కడుపు మంట అంటూ ఆ యాడ్‌ను పోస్ట్ చేశారు పవన్. 

తన సినిమాలను అడ్డుకున్నారని, విశాఖలో తనను వాహనం నుంచి బయటకు రానివ్వలేదని పవన్ మండిపడ్డారు. విశాఖ వదిలి వెళ్లిపోవాలని తనను బలవంతం చేశారని ఆయన ఫైర్ అయ్యారు. ఇప్పటం వెళ్తానంటే మంగళగిరిలో తన కారుని బయటకు వెళ్లనివ్వలేదని , కనీసం నడవనివ్వలేదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన వాహనం రంగు సమస్యగా మారిందని ఆయన దుయ్యబట్టారు. తరువాత తాను ఊపిరి తీసుకోవడం ఆపేయ్యాలా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

click me!