
పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏపీలో రాజధాని అవకాశం ఉన్న ఒకే ఒక్క పట్టణం విశాఖపట్నం అని చెప్పారు. మంత్రి శివరామకృష్ణన్ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇచ్చిందని అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మన విశాఖ- మన రాజధాని సదస్సులో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ప్రధానమైన పరిపాలన రాజధాని విశాఖపట్నమేనని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకేమి పట్టదని మండిపడ్డారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఆరోపించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. రెండేళ్లకే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు.. భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉందని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందని అన్నారు. ఈనాడు రామోజీరావు వ్యాపారాలకు అడ్డం వస్తున్నాననే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పదవి కంటే.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ధర్మాన చెప్పారు. వికేంద్రీకరణకు ఉద్యమంలో చురుగ్గా పాల్గనేందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీఎం జగన్ చెప్పానని.. అయితే ఆయన రాజీనామా వద్దని అన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉందని.. ఆ దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారని చెప్పారు.