అలా చేసుంటే .. తెలంగాణ ప్రజలు విడిపోయేవారా : ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 12, 2022, 2:38 PM IST
Highlights

ఏపీ విభజనకు సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగివుంటే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చేదే కాదన్నారు

వైసీపీ సీనియర్ నేత , మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర, మూడు రాజధానుల వంటి అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరున్నర దశాబ్ధాలుగా అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల అభివృద్ధి జరగకపోవడం వల్లే.. తెలంగాణ ప్రజలు విభజన కోరుకున్నారని ధర్మాన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగివుంటే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చేదే కాదన్నారు. తెలంగాణలో మాదిరే .. మళ్లీ విభజన డిమాండ్ రాదని చెప్పగలరా అని ధర్మాన ప్రశ్నించారు. 

రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చడం వెనుక చంద్రబాబు కుట్ర వుందని మంత్రి ఆరోపించారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు.. ఒకే ప్రాంతంపై ఎందుకు దృష్టి పెడుతున్నారని ప్రసాదరావు నిలదీశారు. ఆయన మనసులో స్వార్ధం వుందని.. అందుకే అమరావతిపై ఫోకస్ పెట్టారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన బంధు మిత్రులకు అక్కడ భూముల్ని కేటాయించారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. అమరావతి ఏర్పాటు వెనుక వున్న దురుద్దేశాలను తాము బహిర్గతం చేశామని.. అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగిందని ఆయన గుర్తుచేశారు. విశాఖలో రాజధాని వద్దంటే ఊరుకునేది లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 

ALso Read:మూడు రాజధానులు జరిగి తీరుతాయ్.. 2024లోపే బిల్లు : తేల్చేసిన కొడాలి నాని

మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు ఈ  నెల 9వ తేదీన అనుమతిని ఇచ్చింది. దీంతో రైతులు ఇవాళ ఉదయం అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని  అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. 
 

click me!