కొందరి వికృత క్రీడలో పాత్రధారులు కావొద్దు .. కోనసీమ వాసులకు మంత్రి చెల్లుబోయిన విజ్ఞప్తి

By Siva KodatiFirst Published May 25, 2022, 7:42 PM IST
Highlights

కోనసీమ వాసులు సంయమనం పాటించి .. శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొందరి వికృత క్రీడలో పాత్రధారులు కావొద్దని ఆయన హితవు పలికారు. ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాలని అనేక డిమాండ్లు వచ్చాయని మంత్రి గుర్తుచేశారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (chelluboyina srinivasa venugopalakrishna) . అమలాపురం అల్లర్లపై (amalapuram violence) ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాలో ఎస్సీలు, బీసీలు అధికంగా వున్నారని  తెలిపారు. అగ్ర కులాలు వున్నప్పటికీ వారికి కూడా తమ ప్రభుత్వం అండగా వుందన్నారు. ఈ జిల్లాలో అశాంతికి కారణం ఎవరు.. దీని వెనుక కర్తలెవరు.. ఎవరి మేలు కోసం ఇదంతా జరుగుతోందన్నది మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా మంత్రి కోరారు. సంయమనం పాటించి.. శాంతిని నెలకొల్పాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్ధనలు, అభ్యంతరాలను తెలియజేయడానికి ఇది మార్గం కాదని చెల్లుబోయిన హితవు పలికారు. 

రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వ వాహనాలపై దాడి చేయడం సరికాదన్నారు. ఇది కుట్రపూరితమైన చర్య అని.. అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. సాధన సమితి ముసుగులో యువతను రెచ్చగొట్టి , సోషల్ మీడియా ద్వారా లేని ప్రచారాన్ని చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కొంతమంది ఆడే వికృత క్రీడలో పాత్రధారులు కావొద్దని.. అలాంటి పార్టీలకు బానిసలు కావొద్దని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతోందని.. అలాంటి చోట అశాంతిని తీసుకొచ్చి లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని చెల్లుబోయిన ఆరోపించారు. 

ALso Read:అన్యం సాయి జనసేన మనిషే.. సాక్ష్యాధారాలివే, కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాలని అనేక డిమాండ్లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ కల్యాణ్ వ్యతిరేకమా, అనుకూలమా అన్నది చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని.. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి విపక్షాలకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి రాజప్ప దూరం వంద అడుగుల దూరంలో వుంటుందని.. అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు కూడా కోరారని  వేణుగోపాలకృష్ణ గుర్తుచేశారు. పక్కనే వున్న రాజప్ప ఇంటిని ఏం చేయని ఆందోళనకారులు సతీశ్ ఇంటిపైకి వచ్చారని.. వాళ్లు నిజమైన నిరసనకారులో కాదో ఈ ఒక్క ఉదాహరణ చాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడిని ప్రతిపక్షనేతగా చంద్రబాబు (chandrababu naidu) ఖండించాలని చెల్లుబోయిన డిమాండ్ చేశారు. స్క్రిప్ట్ సినిమాలకు పనికొస్తుందని.. నిజ జీవితంలో కాదని పవన్ కల్యాణ్ (pawan kalyan) తెలుసుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. కోనసీమ అంటే అప్యాయత, అనురాగానికి, ప్రశాంతతకు మారు పేరని మంత్రి స్పష్టం చేశారు. పోలీసు శాఖ చక్కని సమన్వయంతో పనిచేసిందని చెల్లుబోయిన ప్రశంసించారు. 

click me!