
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లేనిది ఉన్నట్లు చెప్పడంలో చంద్రబాబు సిద్దహస్తుడని విమర్శించారు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఏపీ పోలీసులు బాగా పనిచేశారని కేంద్రం చెప్పిందని అన్నారు. అనవసరమైన విషయాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని చెప్పారు. అక్రమ కేసులు నమోదు కాలేదని తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ, చంద్రబాబు పని అని విమర్శించారు.
చంద్రబాబు హయంలో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సీఎం జగన్ బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని.. వారి అభివృద్ది కోసం ఎంతో చేసిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ డాక్టర్స్, లాయర్స్‌గా పనిచేసిన వారేనని చెప్పారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.