చిరంజీవి సీఎం అయ్యే వారు .. బొత్స సంచలన వ్యాఖ్యలు , పదేళ్ల తర్వాత మెగాస్టార్ ప్రస్తావన ఎందుకు..?

Siva Kodati |  
Published : Feb 14, 2024, 03:20 PM ISTUpdated : Feb 14, 2024, 03:23 PM IST
చిరంజీవి సీఎం అయ్యే వారు .. బొత్స సంచలన వ్యాఖ్యలు , పదేళ్ల తర్వాత మెగాస్టార్ ప్రస్తావన ఎందుకు..?

సారాంశం

ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌లో .. విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సీఎం ఎంపిక సమయంలో తెరవెనుక ఏదో జరిగిందన్న అర్ధం బొత్స మాటల్లో ధ్వనిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరకపోయి వుంటే చిరంజీవి సీఎం అయ్యేవారన్నది బొత్స అభిప్రాయం. 

ఉమ్మడి రాజధాని విషయంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదని, సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. 

ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌లో .. విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన తాను ముఖ్యమంత్రిని కాకుండా చిరంజీవి అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోశయ్యను సీఎంను చేశారని, ఆ పదవిలో తాను కొనసాగలేనని పెద్దాయన చెప్పిన తర్వాత పార్టీ నేతలు చాలా మంది ముఖ్యమంత్రి అవ్వాలని చూశారని ప్రయత్నించారని తెలిపారు. నాడు సీనియర్ మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వున్న తనకు సీఎం పదవి వస్తుందనుకున్నానని.. కానీ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిందని గుర్తుచేశారు. 

సీఎం ఎంపిక సమయంలో తెరవెనుక ఏదో జరిగిందన్న అర్ధం బొత్స మాటల్లో ధ్వనిస్తోంది. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేద్దాం అన్న డిస్కషన్ వచ్చినప్పడు అధిష్టానం ప్రజారాజ్యం పార్టీని కూడా పరిగణనలోనికి తీసుకున్నారని , ఈ సమయంలో చిరంజీవి తనకు మద్ధతుగా నిలవలేదన్నది బొత్స కోపానికి కారణం. కానీ కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ అప్పటికి విలీనం కాలేదని, తర్వాత తానే కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించానని సత్తిబాబు గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరకపోయి వుంటే చిరంజీవి సీఎం అయ్యేవారన్నది బొత్స అభిప్రాయం. రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చిన చిరంజీవి పేరును దాదాపు పదేళ్ల తర్వాత సత్యనారాయణ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యల వెనుక వైసీపీ వ్యూహం ఏమైనా వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన బొత్స.. హైదరాబాద్ వేముల ప్రశాంత్ రెడ్డి సొంత్త ఆస్తా, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌లో ఎవరికైనా ఆస్తులు వుండొచ్చునని, తనకు కూడా ఇల్లు వుందని.. ఏపీలో మంత్రినైతే నా ఆస్తిని ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని బొత్స ప్రశ్నించారు.

ఏపీలో ఓట్లు, డోరు నెంబర్‌లు లేనివాళ్లు రాష్ట్రంలో ప్రతిపక్షనేతలని .. అడ్రస్ అడిగితే పక్కింటి డోర్ నెంబర్ చెప్పే పరిస్ధితి వుందని మంత్రి సెటైర్లు వేశారు. రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని... విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని మాత్రమే వైవీ సుబ్బారెడ్డి చెప్పారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

ప్రతిపక్ష పార్టీలు ఏ డొంకల్లోకి, సందుల్లోకి దూరతాయో వాళ్ల ఇష్టమని.. మా నైతికత మాకు వుందని ఎన్ని కూటములు వచ్చినా ఎదుర్కొంటామని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధి చేకూరితేనే ఓటు వేయాలని అడుగుతున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని.. పీఎఫ్ సహా అన్ని బకాయిలు ఒకటి రెండు నెలల్లో తీరుస్తామన్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని.. ఉద్యోగులు సమ్మె వరకు వెళ్లకూడదన్నది మా ఆలోచని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu