జీవో నెంబర్ 1లో ర్యాలీలు, రోడ్ షోలపై ఏ విధమైన నిషేధం లేదు.. ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి బొత్స

By Sumanth KanukulaFirst Published Jan 7, 2023, 3:11 PM IST
Highlights

రాష్ట్రంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ జీవోపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు
 

రాష్ట్రంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలో శనివారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 1 పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముందుగా ప్రతిపక్షాలు ఈ జీవోను చదువుకోవాలని అన్నారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించినట్టుగా ఉందా? అని ప్రశ్నించారు. అమాయక ప్రజలను చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాల కోరని ప్రజలకు తెలుసని అన్నారు. కందుకూరు సభలో 8 మంది చనిపోతే చంద్రబాబు కనీసం క్షమాపణలు చెప్పలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు మైండ్ సెట్ మార్చుకోవాలి అన్నారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిదేనని చెప్పారు. 

ర్యాలీలు, రోడ్ షోలపై ఎక్కడ కూడా ఏ విధమైన నిషేధం జీవో నెంబర్ 1లో లేదన్నారు. కేవలం రోడ్ల మీద స్టేజ్‌లు ఏర్పాటు చేసి సభలు పెట్టడం మీదనే నిషేధం ఉందన్నారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే.. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని జీవోలో ఉందని  చెప్పారు. ప్రతిపక్షాలు  రాజకీయ లబ్ది పొందేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వారిలో సత్తువ లేక  జీవో నెంబర్ 1‌ను చూపెట్టి ఇంట్లో కూర్చొవాలని చూస్తున్నారని విమర్శించారు. 

click me!