ఆరేళ్ల కిందట హత్య చేశాడు.. పశ్చాత్తాపంతో ఇప్పుడు లొంగిపోయాడు.. ఈ క్రైమ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లో ..

Published : Jan 07, 2023, 11:28 AM IST
ఆరేళ్ల కిందట హత్య చేశాడు.. పశ్చాత్తాపంతో ఇప్పుడు లొంగిపోయాడు.. ఈ క్రైమ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లో ..

సారాంశం

ఆరేళ్ల కింద జరిగిన హత్య కేసు తాజాగా ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడు తానే హత్య చేశానని పోలీసులు ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. 

అతడో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కానీ ఆరేళ్ల కిందట ఓ మహిళను హత్య చేశాడు. ఆమె డెడ్ బాడీ బయటకు రావడంతో పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో తెలియకపోవడంతో పోలీసులు ఆ కేసును తాత్కాలికంగా మూసివేశారు. అయితే ఆ హత్య పట్ల పశ్చాత్తాపానికి గురైన ఆయన తాజాగా పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోయాడు. దీంతో ఆ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

దీనికి సంబంధించి ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. 2016 ఏప్రిల్‌ 7వ తేదీ దాడి లక్ష్మీ అనే మహిళ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆమె దొరకలేదు. అయితే ఏప్రిల్ 11న ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఓ మృతదేహం తేలింది. అది లక్ష్మిది అని భర్త, కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. రెండేళ్లుగా దీనిపై కసరత్తు చేసినప్పటికీ తగిన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు 2018లో కేసును తాత్కాలికంగా మూసివేశారు.

కాగా.. జనవరి 4వ తేదీన దాసరి ఢిల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. 2016లో దాడి లక్ష్మి అనే మహిళను తానే హత్య చేశానని ఒప్పుకొని లొంగిపోయాడు. వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఢిల్లేశ్వరరావు చాలా కాలం క్రితం ఆర్మీ నుండి రిటైర్ అయ్యారని తెలిసింది. తరువాత ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. 2016లో గోపాలపట్నంలో ఇళ్లు కొన్నాడు. 

ఇంకా కొంత డబ్బును భార్య అకౌంట్ లో ఉంచారు. అయితే ఆయనకు డబ్బు అవసరమై భార్యను అడిగాడు. కానీ ఆమె దానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ఢిల్లీశ్వరరావు తన భార్య దగ్గర ఏటీఎం కార్డులను దొంగిలించి లక్ష్మి అనే మహిళకు ఇచ్చాడు. ఆమెకు, అతడికి అంతకు ఆరు నెలల ముందు నుంచి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే సీసీ కెమెరాల్లో తన మొఖం కనిపించకూడదనే ఉద్దేశంతో లక్ష్మీతో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయించాడు. 

లక్ష్మీ రూ. 25 వేలు డ్రా చేసింది. దీంతో ఢిల్లీశ్వరరావు ఆమెకు రూ. 2,000 టిప్‌గా ఇచ్చాడు. డబ్బు విత్‌డ్రా అయిన విషయం తెలుసుకున్న దిల్లేశ్వరరావు భార్య బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ఓ మహిళ డబ్బులు డ్రా చేసిందని గుర్తించారు. ఈ విషయం ఆమెకు చెప్పారు. ఆ మహిళ ఎవరని భార్య ఢిల్లీశ్వరరావును ప్రశ్నించింది. కానీ ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయం వారి కుటుంబ పెద్దలకు కూడా చేరింది. 

అయితే తన భార్య ఏదో ఒక రోజు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని, అలా చేస్తే లక్ష్మితో తనకున్న సంబంధాన్ని బహిర్గతం అయ్యే అవకాశం ఉందని ఢిల్లేశ్వరరావు భయపడ్డాడు. ఆమెను హత్య చేస్తే ఈ విషయం భయటకు రాదని భావించాడు. 2016 ఏప్రిల్ 7వ తేదీన ఆమెకు కాల్ చేశాడు. ముడసర్లోవ పార్కుకు తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టి, దానికి పెద్ద బండరాయిని కట్టి రిజర్వాయర్‌లో పడేశాడు. కొన్ని రోజుల తరువాత ఆ డెడ్ బాడీ బయటకు తేలింది. కానీ ఈ కేసు ఎటూ తేలలేదు. 

కాగా.. ఢిల్లీశ్వరరావు ఇంట్లో కుటుంబ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. తాను చేసిన పాపం వల్ల తన కుటుంబం విచ్ఛిన్నమైందని, దీనికి కారణం తాను చేసిన హత్యే అని ఆయన పశ్చాత్తాపపడ్డాడు. దీంతో జనవరి 4వ తేదీన ఆయన పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. 2016లో లక్ష్మీని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు ఆయనను గురువారం కోర్టులో హాజరుపర్చారు. రాత్రి సమయంలో రిమాండ్ కు తరలించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే