
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి వుంది. అయితే అనుకోని కారణాల వల్ల గంట ఆలస్యంగా ఫలితాలను విడుదల చేశారు. ఎప్పటిలాగే ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో బాలురకంటే బాలికలే పైచేయి సాధించారు. మొత్తం మీద ఫస్టియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత రాగా, సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.సెకండియర్ విషయానికి వస్తే.. 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో బాలురు 58 శాతం , బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 6 నుంచి జూన్ 9 వరకు ప్రాక్టీకల్స్ జరుగుతాయని.. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
కాగా.. ఈ సంవత్సరం మార్చి 15వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా.. మార్చి 16వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీన ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో 10,03,990 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది ఉండగా.. రెండో సంవత్సరానికి చెందిన విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు.