విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు . బాధితుల సహాయం కోసం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఘటనాస్థలికి 14 అంబులెన్స్‌లు చేరుకున్నాయి . అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.
బాధితుల సహాయం కోసం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. బాధితులు 9493589157 నెంబర్‌ను ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ఆమె మీడియాకు వెల్లడించారు. అలాగే రైల్వే ఫోన్ నెంబర్ 8978080006 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
మరోవైపు.. రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన జగన్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని , మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని జగన్ సూచించారు.
కాగా.. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు అలమండ - కోరుకొండ స్టేషన్ మధ్యలో నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో దాని వెనుకే అత్యంత వేగంగా వచ్చిన విశాఖ-పలా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక , రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బోగీలలో కొందరు ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. చిమ్మ చీకటిగా వుండటంతో అంబులెన్స్‌లు ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది ప్రత్యేక రైలులో చేరుకున్నారు.
ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు సమాచారం కోసం 8912746330, 8912744619, 8500041670, 8500041671 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.