
శుక్రవారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన రోడ్ షోలో తనపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి వెళ్లి తాను ఒక పనికిమాలిన వ్యక్తి అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు. పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మంచి మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
బైజూస్‌తో (byjus) ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స దుయ్యబట్టారు. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని సెటైర్లు వేశారు. మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని... అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:సారా వ్యాపారం చేసుకునే బొత్సకు విద్యాశాఖా.. జగన్ సీఎంగా వుంటే ఇంతే : చంద్రబాబు
ఇకపోతే.. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఇష్టారాజ్యంగా పన్నులు పెంచేసిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి ఇక అభివృద్ధి ఏం చేస్తారని చంద్రబాబు సెటైర్లు వేశారు. అన్ని వర్గాలను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ప్రతిపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఆరాచకాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ అధినేతగా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరూ భయపడొద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం వారంటూ సంక్షేమ పథకాలను ఆపేస్తే ఊరుకోబోమన్న ఆయన కోర్టులకు వెళ్లైనా సరే న్యాయం చేయిస్తానని తెలిపారు. వైసీపీ (ysrcp) ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు.
జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఎవరికీ ఉద్యోగాలు, పెట్టుబడులు రావని, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రా నినాదంతోనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. సారా వ్యాపారం మాత్రమే తెలిసిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలిచ్చారంటూ సెటైర్లు వేశారు. నిజాయతీపరుడైన అశోక్ గజపతి రాజుని (ashok gajapathi raju) ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేసి, ఎన్నో కేసులు పెట్టినా అవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు ప్రశంసించారు.